కూకట్ పల్లి బరిలో విజయశాంతి.. ప్రచారానికి బాలయ్య

 

 

తెలంగాణలో డిసెంబర్ 7 న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. తెరాస, మహాకూటమి అధికారం కోసం నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడుతున్నాయి. ప్రచారంలో దూసుకుపోతున్నాయి. కాంగ్రెస్ తమ పార్టీ స్టార్ క్యాంపైనర్ గా విజయశాంతిని నియమించిన విషయం తెలిసిందే. విజయశాంతి ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయనని, ప్రచార బాధ్యతలు మాత్రమే చూసుకుంటానని అన్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం విజయశాంతిని ఎన్నికల బరిలోకి దింపాలని భావిస్తోందట.

విజయశాంతి దుబ్బాక నుంచి పోటీ చేస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఆమెను కూకట్ పల్లి నుంచి పోటీకి దించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సీటును వాస్తవానికి టీడీపీ ఆశించింది. టీడీపి నేత పెద్దిరెడ్డి ఈ సీటు నుంచి పోటీ చేయడానికి ఆసక్తి కనబరిచారు. అయితే ఆయనను పోటీకి దూరంగా ఉంచుతూ.. ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దాంతో ఆయన పోటీ చేయాలనే ఆలోచనను విరమించుకున్నట్లు సమాచారం. ఆంధ్ర ఓటర్లు ఎక్కువగా ఉన్న కూకట్ పల్లిలో టీడీపికి విజయం సులభం అనే అభిప్రాయం ఉంది. విజయశాంతిని కూకట్ పల్లి నుంచి పోటీకి దించితే సీటుని త్యాగం చేయడానికి టీడీపి సిద్ధపడినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా విజయశాంతి విజయం కోసం కూకట్ పల్లిలో నందమూరి బాలకృష్ణ కూడా ప్రచారం చేస్తారని అంటున్నారు. మరి విజయశాంతి నిజంగానే కూకట్ పల్లి బరిలో దిగి.. బాలకృష్ణ ప్రచారానికి వస్తే కూకట్ పల్లి స్థానం కూటమి ఖాతాలో ఈజీగా పడిపోయే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.