సానుభూతే ఆయుధంగా బరిలోకి దిగుతున్న వైకాపా

 

జగన్ మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళక ముందు అతను, ప్రమాదంలో మరణించిన తండ్రి రాజశేఖర్ రెడ్డి నామస్మరణ చేస్తూ ప్రజల సానుభూతి పొందే ప్రయత్నం చేసారు. కొత్తగా పెట్టిన తన రాజకీయ పార్టీని పటిష్టపరుచుకొనేందుకు అతను దాదాపు ఏడాదిపాటు ఓదార్పుయాత్ర సాగించిన తరువాత అక్రమాస్తుల కేసులో అరెస్టయ్యి జైలుకి వెళ్ళవలసి వచ్చింది. నాటి నుండి పార్టీ భాద్యతలను తమ భుజస్కంధాల మీద వేసుకొన్న అతని తల్లి విజయమ్మ, సోదరి షర్మిలకు అతని అరెస్టుతో మరో కొత్త అస్త్రం దొరికింది. అదే సానుభూతి అస్త్రం. (రాజశేఖర్ రెడ్డి) సెంటిమెంట్ తో బాటు, నాటినుండి జగన్ మోహన్ రెడ్డిని అన్యాయంగా జైలులో పెట్టారంటూ ప్రజలకి చెప్పుకొంటూ వారి సానుభూతిని పొందే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, చంద్రబాబుని అసమర్ధులు, అవినీతిపరులు అని దుయ్యబట్టడం, వైయస్సార్- సెంటిమెంట్ మరియు జగన్-సానుభూతి అనే పాయింట్ల మీదనే వారిరువురూ గత ఏడాది కాలంగా మాట్లాడుతున్నారు తప్ప వేరే కొత్తగా మాట్లడేందుకు ఏమీ లేదు.

 

మళ్ళీ ఇప్పుడు పంచాయితీ ఎన్నికలు దగ్గర పడుతున్నందున, విజయమ్మ మరో మారు ఈ ‘సెంటిమెంట్-సానుభూతి’ అస్త్రాలను ప్రజల మీదకి ప్రయోగిస్తున్నారు. ఈ సారి విజయమ్మ ముఖ్యమంత్రి మీద తాజాగా మరో కొత్త ఆరోపణ కూడా చేసారు. ఆయన డిల్లీ వెళ్లి జగన్ మోహన్ రెడ్డిని పంచాయితీ మరియు స్థానిక ఎన్నికలు పూర్తయ్యేవరకూ జైలు నుండి విడుదల చేయవద్దని, ఈ లోగా తానూ పార్టీని బలపరుచుకొని ఎన్నికలలో గెలవగలనని ఆయన కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరినట్లు ఆమె ఆరోపించారు. ఈ విషయంలో తనకు డిల్లీ నుండి ఖచ్చితమయిన సమాచారం ఉందని ఆమె చెప్పడం మరో విశేషం. మరి కిరణ్ కుమార్ రెడ్డి ఎవరిని అడిగారో, దానిని ఎవరు విని ఆమెకు చేరవేసారో మాత్రం తెలియదు.

 

రెండు నెలల క్రితం సుప్రీం కోర్టు జగన్ మోహన్ రెడ్డి పెట్టుకొన్న బెయిలు పిటిషను తిరస్కరిస్తూ, సీబీఐకి నాలుగు నెలల గడువు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. నాలుగు నెలలలోగా సీబీఐ గనుక తన దర్యాప్తు పూర్తి చేయలేకపోతే, అప్పుడు ఆయన క్రింద కోర్టులో మళ్ళీ బెయిలు పిటిషను దరఖాస్తూ చేసుకోవచ్చునని ఆనాడే సుప్రీంకోర్టు స్పష్టమయిన తీర్పు చెప్పింది. అంటే జగన్ కు ఎట్టి పరిస్థితుల్లో ఆగస్ట్ నెలాఖరు వరకు బెయిలు కోరేందుకు అవకాశం లేదన్న మాట.

 

మరి ఈ విషయాన్నీదాచిపెట్టి, విజయమ్మ ముఖ్యమంత్రి తన కొడుకుని ఎన్నికలు ముగిసే వరకు జైలులో నిర్బంధించి ఉంచమని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరినట్లు చెప్పడం చూస్తే, చివరికి తన కొడుకు జైలులో నిర్బందించబడటాన్ని కూడా ఎన్నికల కోసం వాడుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు అర్ధం అవుతుంది.

 

సైన్యాధ్యక్షుడు లేకుండా యుద్ద రంగంలో అడుగుపెట్టబోతున్నసైన్యంలా ఉన్న తమ పార్టీని, ఎన్నికల కురుక్షేత్రంలోగెలిపించు కోవడానికి ఆమె సానుభూతినే ఆయుధంగా వాడుకోక తప్పడం లేదు. పాదయాత్రలతో విలువయిన తన సమయం వృధా చేసుకొంటున్న షర్మిల, తన పార్టీని బలోపేతం చేసుకొనేందుకు ప్రయత్నిచి ఉంటే పార్టీకి ఇటువంటి దుస్థితి వచ్చేది కాదేమో.