జగన్ ను జైలు భయం వెంటాడుతోందా? సీబీఐ జేడీని మార్చమని లేఖ ఎందుకు రాశారు?

వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి లేఖపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పందించారు. హైదరాబాద్‌ సీబీఐ జేడీగా తెలుగు రాష్ట్రాలకు, రాజకీయాలకు సంబంధంలేని అధికారిని నియమించాలన్న విజయసాయిరెడ్డి వినతిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖను అమిత్‌షా ఆదేశించారు. అయితే, చంద్రబాబు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ టార్గెట్ గా అమిత్ షాకి లేఖ రాసిన విజయసాయిరెడ్డి... ఇద్దరి మధ్య సంబంధాలను ఎత్తిచూపారు. 

గతంలో సీబీఐ జేడీగా ఉన్న లక్ష్మీనారాయణకు, చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, దాంతో ఇద్దరూ కలిసి... వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఇబ్బందులు సృష్టించారని అమిత్‌షాకి రాసిన లేఖలో విజయసాయి ప్రస్తావించారు. చంద్రబాబు కనుసన్నల్లో ఆనాటి సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ పనిచేస్తూ జగన్ ను ఇబ్బంది పెట్టారని అన్నారు. చంద్రబాబుతో లక్ష్మీనారాయణకు సంబంధాలు ఉన్నాయనడానికి... ఇద్దరూ ఆనాడు అనేకసార్లు ల్యాండ్ లైన్లో మాట్లాడుకున్నారని తెలిపారు. లక్ష్మీనారాయణ తప్పుడు ప్రవర్తన, రాజకీయ ప్రమేయంపై సీబీఐలో అంతర్గత విచారణ సైతం జరిగిందని విజయసాయి గుర్తుచేశారు. ఇక, మొన్నటి ఎన్నికల్లో లక్ష్మీనారాయణ మొదట తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించారని.... కానీ, చివరి నిమిషంలో టీడీపీతో వ్యూహాత్మక భాగస్వామైన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీచేశారని అమిత్‌షా రాసిన లేఖలో విజయసాయి పేర్కొన్నారు. 

ప్రస్తుత హైదరాబాద్ సీబీఐ జేడీగా ఉన్న కృష్ణ కూడా తెలుగు వ్యక్తేనని, అలాగే, రాజకీయాలతో ముడిపడి ఉన్న అధికారని అన్నారు. అంతేకాదు, కృష్ణ సైతం మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయాలతో ప్రభావితమై నిర్ణయాలు తీసుకుంటున్నారని అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు లక్ష్మీనారాయణ సన్నిహితులైన మరో అధికారి హెచ్.వెంకటేష్... సీబీఐ జేడీగా రావడానికి ప్రయత్నిస్తున్నారని.... అయితే, తనది ఆంధ్రప్రదేశ్ కాదని, కర్ణాటక అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారని... కానీ ఆయన తల్లిదండ్రులంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారేనని విజయసాయి తన లేఖలో అమిత్‌షాకి వివరించారు. హెచ్.వెంకటేష్... మూలాలన్నీ ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయని, అలాగే లక్ష్మీనారాయణతో ఆర్థిక సంబంధాలు కూడా ఉన్నాయని అన్నారు. అదేవిధంగా లక్ష్మీనారాయణ సీబీఐ జేడీగా ఉండగా హెచ్.వెంకటేష్... ఎస్పీగా పని చేశారని గుర్తుచేశారు.

అయితే, చంద్రబాబు తన మనుషులను సీబీఐలో పెట్టుకుని చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్నారని విజయసాయి ఆరోపించారు. అలాగే, తన హయాంలో జరిగిన భారీ అవినీతి నేపథ్యంలో కేసుల నుంచి రక్షణ కోసం తన అధికారులను సీబీఐ హైదరాబాద్‌లో నియమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. హైదరాబాద్ సీబీఐ జేడీగా నియామకాలు దురుద్దేశ పూర్వకంగా, రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతున్నాయని, అందుకే ఆంధ్రప్రదేశ్‌కు చెందని, రాజకీయాలతో సంబంధం లేని అధికారిని హైదరాబాద్లో సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా నియమించాలని కోరారు. అయితే, విజయసాయి లేఖకు రిప్లై ఇఛ్చిన అమిత్ షా..... తగిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖను అమిత్‌షా ఆదేశించారు.