కేంద్ర క్యాబినెట్ లోకి విజయసాయి రెడ్డి, నందిగం సురేష్!

రాత్రికి రాత్రి రాజకీయం మారిపోయింది. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపధ్యం లో, కేంద్ర క్యాబినెట్ లోకి ఇద్దరు వైఎస్ఆర్సిపీ ఎం.పీ లకు చోటు దక్కబోతున్నట్టు సమాచారం. రాజ్యసభ సభ్యుడు వి విజయసాయి రెడ్డి గట్టి లాబీయింగ్ తో -ముఖ్యమంత్రి- ప్రధానమంత్రి మధ్య బుధవారం జరగబోతున్న రెండు గంటల కీలక సమావేశం లో... కేంద్ర  క్యాబినెట్ లోకి వై ఎస్ ఆర్ సి పీ చేరటానికి జగన్ మోహన్ రెడ్డి తన అంగీకారం తెలియచేయబోతున్నట్టు సమాచారం. విజయసాయి రెడ్డి సహాయమంత్రిగా స్వతంత్ర హోదాలోనూ, అలాగే బాపట్ల లోక్ సభ స్థానం నుంచి గెలిచిన నందిగం సురేష్ మరొక సహాయమంత్రిగానూ కేంద్ర క్యాబినెట్ లో చేరబోతున్నట్టు సమాచారం.

అసలిక ఎలాంటి పరిస్థితుల్లోనూ, వైఎస్ఆర్సిపికీ, బీజెపికి మధ్య సయోధ్య కుదరకపోవచ్చుననీ, ఈ నేపథ్యంలో బీజెపీ తో జట్టు కట్టిన జనసేనను అడ్డం పెట్టుకుని రాష్ట్రం లో మరో సారి వ్యూహాత్మక రాజకీయం నడపవచ్చుననీ భావించిన తెలుగు దేశానికి, ఈ తాజా పరిణామం కొంచెం మింగుడు పడని అంశమే. వాస్తవానికి లోగడ రెండు సందర్భాల్లోనూ.. ఢిల్లీ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తోనూ, అమిత్ షా తో నూ అపాయింట్మెంట్ దొరక్క వెనుదిరిగిన జగన్ మోహన్ రెడ్డి, ఆ తర్వాత అపాయింట్మెంట్ కోసం కొంత గ్యాప్ తీసుకున్నారు. ఈ లోపు, బిజెపి రాజ్య సభ్యుడు వై.ఎస్. సుజనా చౌదరికి, అలాగే వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి మధ్య నడిచిన లేఖల యుద్ధం, అలాగే ట్విట్టర్ వార్, ఇంకా సుజనా ఆర్ధిక నేరాల మీద రాష్ట్రపతి జోక్యం కోరుతూ విజయసాయి రెడ్డి రాసిన లేఖల పర్యవసానం గా ....బీ జీ పీ కి, వై ఎస్ ఆర్ సి పీ కి మధ్య చెడిందనే అందరూ భావించారు.

ఈ క్రమంలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావటం, విజయసాయి రెడ్డి గట్టిగా లాబీయింగ్ చేయటంతో మొత్తానికి... ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రుల మధ్య జరగనున్న సమావేశం ప్రాధాన్యం సంతరించుకోనుంది. కీలకమైన బిల్లుల ను రాజ్యసభలో పాస్ చేయించుకోవాలంటే, బీజెపీ కి అనివార్యంగా ప్రాంతీయ పార్టీల సహకారం అవసరం. దానికి తోడు, మార్చ్ లో ఆంద్ర ప్రదేశ్ నుంచి ఖాళీ కానున్న నాలుగు స్థానాల్లోనూ వైఎస్ఆర్సిపీ అభ్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నికవుతారు కాబట్టి, అది రాజ్యసభ లో ' ఆపత్కాలం' లో బీజీపీ కి అనుకూలించే అంశం.

తన సహజ స్వభావానికి విరుద్ధంగా, పరిమితంగా అయినప్పటికీ మీడియాతో మాట్లాడిన జగన్ మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి గా తన ప్రాధాన్యాలేమిటో చెప్పకనే చెప్పారు. కేంద్రానికి కూడా తమతో అవసరాలుంటాయనీ, ఆ సందర్భంలో ప్రత్యేక హోదా అంశం మీద తమ పట్టు బిగిస్తామనీ కూడా ఆయన చెప్పకనే చెప్పారు. అంతే కాదు... ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదని స్పష్టం చేశారు కూడా. పోలవరం నిధుల దగ్గరనుంచి, రాష్ట్రానికి రావలసిన వాటాల దాకా అన్నీ మాట్లాడటానికి తగిన సరంజామా తో ఢిల్లీ కి బయల్దేరుతున్న జగన్ మోహన్ రెడ్డి ని కేంద్ర క్యాబినెట్ లో వై ఎస్ ఆర్ సి పీ ని భాగస్వామి కావాల్సిందిగా స్వయంగా నరేంద్ర మోడీ నే కోరే అవకాశాలున్నాయని, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా జగన్ కూడా అందుకు అంగీకరిస్తారనీ వై ఎస్ ఆర్ సి పీ వర్గాల భోగట్టా!