విజయారెడ్డి మర్డర్ వెనుక అనేక అనుమానాలు... అసలు అక్కడుండే అటెండర్ ఏమైనట్లు?

అసలు ఆ అరగంట అక్కడేం జరిగిందో తెలియదు... దేనికోసం గొడవ పడ్డారో అసలే తెలియదు... ఇద్దరి మధ్య వాగ్వాదానికి కారణమేంటో కూడా తెలియదు... కానీ విజయారెడ్డి... నిందితుడు సురేష్ మధ్య మొదలైన మాటలు కాసేపట్లో మంటలుగా మారిపోయాయి. అందరూ చూస్తుండగా క్షణాల్లోనే విజయారెడ్డి ప్రాణాలు మంటల్లో కాలి ఆహుతైపోయాయి. మంటల తీవ్రతకు విజయారెడ్డి అక్కడికక్కడే కుప్పకూలి మరణించారు. ఒక్కసారిగా పెట్రోల్ పోసి నిప్పంటించడంతో... తనను తాను కాపాడుకునేందుకు తహశీల్దార్ విజయారెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. తన ఛాంబర్ నుంచి బయటికి పరుగులు తీశారు. కానీ తన ఛాంబర్ తలుపు దగ్గరే కుప్పకూలి...గిలగిలా కొట్టుకున్నారు. మంటలను తట్టుకోలేక కేకలు వేస్తూ అల్లాడిపోయారు. మిగతా ఉద్యోగులు... అసలేం జరుగుతుందో తెలుసుకునేలోపే విజయారెడ్డి మంటల్లో కాలిపోయారు.

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ తహశీల్దార్ కార్యాలయంలో జరిగిన మహిళా అధికారిణి దారుణ హత్య... తెలంగాణవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అత్యంత పాశవికంగా తహశీల్దార్ ను మర్డర్ చేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక, విజయారెడ్డిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరు ఉద్యోగుల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే, తహశీల్దార్ ఛాంబర్లోకి ఇతరులు ఎవరైనా వెళ్లాలంటే కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడుంటే అటెండర్ ద్వారా తహశీల్దార్ కు సమాచారమిచ్చి... అనుమతి ఇస్తే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. మరి, నిందితుడు సురేష్ ...రెగ్యులర్ గా తహశీల్దార్ కార్యాలయానికి వస్తాడో ఏమో తెలియదు కానీ... నేరుగా విజయారెడ్డి ఛాంబర్ లోకి వెళ్లడం... అరగంటపాటు వాగ్వాదానికి దిగడం... ఆ తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టడం చూస్తుంటే... అనుమానాలకు తావిస్తోంది.