వీడియో క్యాసెట్‌ తిరిగివ్వనందుకు 14 ఏళ్ల తరువాత అరెస్టు

కోట్లు దోచుకునే బడాబాబులకు రాచమర్యాదలు చేయడం. పరిస్థితులు మరీ విషమిస్తే వారు దేశం వదిలి వెళ్లేదాకా గమ్మున ఉండటం మనం చూస్తున్నదే. కానీ అమెరికాలో జరిగిన ఓ ఘటన గురించి వింటే, ప్రపంచమంతా ఇదే తంతు నడుస్తున్నట్లు తోస్తోంది! అమెరికాలోని నార్త్ కెరోలినాకు చెందిన జేమ్స్‌ మెయర్స్‌, తన కూతురుని బడిలో దింపేందుకని కారులో బయల్దేరాడు. దారిలో పోలీసులు అతన్ని ఆపడంతో బుద్ధిగా తన లైసెన్సుని వారికి చూపించాడు. ఆ లైసెన్సుని కాసేపు పరీక్షించిన పోలీసులు అతని చేతికి బేడీలు వేశారు.

 

కారణం! జేమ్స్ 14 సంవత్సరాల క్రితం ఒక వీడియో క్యాసెట్‌ను తీసుకుని తిరిగివ్వడం మర్చిపోయాడంట. ప్రస్తుతానికి వీడియో క్యాసెట్లు ఎలాగూ లేవు, జేమ్స్‌కు ఆ క్యాసెట్‌ను అద్దెకు ఇచ్చిన దుకాణం కూడా మూతపడిపోయింది. కానీ సదరు దుకాణదారుడు వేసిన కేసు మాత్రం అలాగే ఉండిపోయింది. పోలీసులు మత్తుపదార్థాలని అమ్మేవారిని వదిలేసి, అద్దె క్యాసెట్ల గురించి సమయాన్ని వృథా చేస్తున్నారంటూ, జేమ్స్ మండిపడుతున్నాడు. ప్రజల సొమ్ముని ఇలా దుర్వినియోగం చేస్తున్నారంటూ తిట్టిపోస్తున్నాడు. తన ఆవేశాన్నంతా వెల్లగక్కుతూ జేమ్స్‌ ఓ వీడియోని రూపొందించి యూట్యూబ్‌లోకి కూడా వదిలాడు. మరి జేమ్స్‌ని న్యాయమూర్తులు మందలించి వదిలిపెడతారో, జరిమానా విధిస్తారో, ఏకంగా జైలు శిక్షే వేస్తారో చూడాలి.