చీకటిని జయించిన విశాఖవాసి జగదీష్

చీకటిని జయించిన విశాఖవాసి జగదీష్


 

"మనకోసం మనం బతుకుతూ పక్కవారిని బ్రతికించాలి. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయడం అనేది ప్రతి ఒక్కరి భాధ్యతగా స్వీకరించాలి" అని చెప్పడమే కాదు.. ఈ మాటలను నిజంగానే చేస్తూ.. అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు జగదీష్.

 

 

విశాఖపట్నం దగ్గరలోని పద్మనాభం మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా వున్న "జగదీష్" మాటలు చెప్పడమే కాకుండా వాటిని ఆచరణలో పెడుతున్నాడు. పెదపిల్లలకి ఉన్నత చదువులు చదువుకోవటానికి ఆర్థిక సాయం అందించటంతో మొదలైన అతని సేవా ప్రస్థానం ఊరూరా తిరిగి సమాచార హక్కు చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించటం దాకా వచ్చింది. ఆ ప్రయాణంలో ఎందరో అవసరాలను తీరుస్తూ, మరెందరికో స్పూర్తిగా నిలుస్తూ సాగిపోతున్న జగదీష్ గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవటానికి కారణం.. వేరొకరి ఆసరా లేనిదే అడుగైనా పడని దీనస్థితి నుంచి తానే ఎందరికో మార్గదర్శకం అయ్యే స్థాయికి రావటమే జగదీష్.

 

 

పుట్టుకతోనే అంధుడు. పుట్టుకతోనే వెలుగును చూడలేని అసహాయత జగదీష్ ని, అతని తల్లిదండ్రులని కొంత బాధపెట్టినా, సమస్యని చూసి బాధపడటం కన్నా, దానిని ఎదుర్కోవటమెలాగో ఆలోచించాలని నిర్ణయించుకున్నారు. జగదీష్ "నేను చదువుకుంటాను" అని అన్నాడు. అది తన సమస్యకి కొంత పరిష్కారం చూచించగలదని నమ్మాడు. అంతే రెండు ఎం.ఏ లు చేశాడు. ఉపాధికి ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా సంపాదించాడు. తన జీవితం కుదుటపడిందని సంతోషించలేదు అతను.

 

 

ఈ స్థాయికి రావటానికి అతి నిరుపేద కుటుంబంలో పుట్టిన తను ఎన్నెన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చిందో జగదీష్ మర్చిపోలేదు. ఆ ఇబ్బందులతో పోరాడలేక ఎంతమంది మధ్యలోనే చదువు ఆపేస్తుంటారు. వారికి తను సహాయంగా నిలవాలి అనుకున్నాడు. అందుకు జగదీష్ వెలుతురంటే తెలియని ఎంతోమంది జీవితాలలో వెలుగులు నింపాలని జగదీష్ నిర్ణయించుకున్నప్పటి నుండి ఇక వెనక్కి తిరిగి చూడలేదు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం వంటివి ఏవి కూడా అతడిని ఆపలేకపోయాయి. 180 మంది నిరుపేద విద్యార్థులను ఎంపిక చేసి పాలిటెక్నిక్, ఇంటర్ మీడియట్ లలో చేర్పించాడు. ఆ తర్వాత చుట్టు పక్కలలోని గ్రామాలలో పదవ తరగతితో చదువు ఆపేసిన పిల్లలందరిని పై చదువులు చదివిపించే భాద్యత తానే తీసుకున్నాడు. వారికి అయ్యే ఫీజులు, పుస్తకాలు, పెన్నులు ఇలా అన్ని ఖర్చులు కూడా తానే భరించాడు. ఇక ఆ తర్వాత తనలా చూపులేని వారి సమస్యలపై దృష్టి పెట్టాడు. చూపులేని వాళ్ళు ఎవరి కాళ్ళపై వారు నిలబడాలి. ఉద్యోగాలు చెయ్యాలన్నది జగదీష్ ధృడ సంకల్పం.

 

అందుకోసం పోటీ పరీక్షలు రాయదలుచుకున్న అంధ విద్యార్థుల కోసం బ్రెయిలీ లో స్టడీ మెటీరియల్ తయారు చేశాడు జగదీష్. DSc, Group-1&2 పాఠాలను కొంతమంది సాయంతో చదివించి సీడీలుగా రికార్డు చేయించాడు. 2008లో DSc పరీక్షలకు హాజరైన 1250 మంది అంధులకు ఆ సీడీని అందించాడు. వారిలో 132 మంది ఉద్యోగాలు కూడాసంపాదించగలిగారు. అలాగే 10మంది వాలంటీర్ల సహాయంతో పద్మనాభం చుట్టుపక్కల గ్రామాల్లో రాత్రి బడులు తెరిపించాడు. నిరక్షరాస్య మహిళలకు చదవటం, రాయటం చెప్పించటం మొదలు పెట్టాడు. కొంతమంది వికలాంగులకి నెలకి సరిపడా భోజన ఖర్చులని తానే భరిస్తూ, వారు పై చదువులు చదువుకునేలా ప్రోత్సహిస్తున్నాడు.

 

 

"ఆసరా" పేరుతో స్వచ్ఛంద సంస్థని ప్రారంభించిన జగదీష్ దాని కార్యకలాపాలలో సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించటాన్ని కూడా చేర్చాడు. విద్యార్థి దశ నుంచే ఈ చట్టంపై అందరిలో అవగాహన పెరగాలన్నది అతని ఆలోచన. అందుకోసం వివిధ జిల్లాల్లో విద్యార్థుల కిసం అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నాడు. ఇవే కాదు సమాజం కోసం తనేం చేయగలడో వాటన్నింటిని చేయాలనే ఆరాటం. అందరి జీవితాల్లో వెలుగు నిండాలి-ఆత్మవిశ్వాసం, ఆత్మ స్థైర్యం స్వంతమవ్వాలి. ప్రతి ఒక్కరు జీవితాన్ని ప్రేమించాలి. ఇవి జగదీష్ లక్ష్యాలు. అందుకోసం నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాడు.

 

- రమ