అంగన్ వాడీ ఉద్యోగితో వెట్టిచాకిరీ! జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిర్యాదు 

జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. తన నివాసంలో అంగన్ వాడీలతో వెట్టిచాకిరి చేయిస్తున్నట్లు ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి. ఉద్యోగం కోసం మూడున్నర లక్షలు చెల్లించాలని డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో బాధితురాలు ఆరోపించారు. అంగన్ వాడీలో పనిచేస్తున్న తనను ఇంట్లో పనిమనిషిగా పెట్టుకున్నారని.. కాళ్లు పట్టించుకోవడం సహా అన్ని పనులు చేయిస్తున్నారని వాపోయింది. ఉద్యోగంలో నుంచి తీసేస్తామని బెదిరించడంతో రూ.2లక్షలు చెల్లించానని.. కానీ మరింత డబ్బు కావాలని డిమాండ్ చేస్తున్నారని ఆమె తెలిపింది. అడిగినంత డబ్బు ఇవ్వనందుకు తనను చిత్రహింసలు పెడుతున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించింది బాధితురాలు. 

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డిపై..  నెల్లూరు వైఎస్ఆర్ కాలనీలో అంగన్ వాడీ ఆయా రిహానా పోలీసులకు ఫిర్యాదు చేసింది.   జేసీ దగ్గర సీసీగా పనిచేసే శ్రీకాంత్, డ్రైవర్ వికార్ సు తనపై దూషణలకు దిగడమే కాకుండా దాడి చేశారని ఆరోపించింది. ఆరోగ్యం సరిగా లేక పనిలోకి వెళ్లకపోతే ఇంట్లో రూ.1.50 లక్షలు చోరీ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారని వెల్లడించింది. ఐదు రోజులుగా పోలీసులు తనను చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు వివరించింది. చేయని తప్పులు నాపై వేసి డబ్బులు వసూల్ చేయడానికి నన్ను 5 రోజులు నుండీ పోలీసు స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారని అవేదన వ్యక్తం చేసింది. స్థానిక పోలీస్ స్టేషన్లో జేసీతో పాటు ఆయన సిబ్బందిపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని వేడుకుంది.

జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి బంగ్లాలో వేధింపులకు గురైన అంగన్ వాడీ హెల్పర్ కు మద్దతుగా కోటమిట్టలో బాధితురాలు, ముస్లిం సంఘాలు ఆందోళనకు దిగాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి ని సస్పెండ్ చేయాలని , వేధింపులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కలిసి విన్నవించారు. 

మరోవైపు అంగన్ వాడీ ఉద్యోగితో తన ఇంట్లో వెట్టి చాకిరి చేయిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న జేసీ ప్రభాకర్ రెడ్డి.. తన పిల్లలిద్దరినీ ప్రభుత్వ పాఠశాలలో చెర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. అలాంటి జేసీపై వెట్టిచాకిరి ఆరోపణలు రావడం నెల్లూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.