మ‌మ్మీ, డాడీ, డ‌మ్మీ కాదు..

 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఈరోజు నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం ఐనవోలులో వెల్లూరు సాంకేతిక విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ఇంగ్లిష్ నేర్చుకోవాలి కానీ, ఇంగ్లిష్ వారి బుద్ధులు తెచ్చుకోకూడదని అన్నారు. ‘పిల్ల‌ల‌కు తెలుగు నేర్పించండి.. తెలుగు మ‌ర్చిపోతే అమ్మ‌ను కూడా మ‌ర్చిపోతారు. హిందీ, ఇంగ్లిష్ తో పాటు అన్ని భాష‌లు నేర్చుకోవాలి. మ‌మ్మీ, డాడీ, డ‌మ్మీ అని అన‌కూడ‌దు.. చ‌క్క‌గా తెలుగులో అమ్మ‌, నాన్న అనండి. అమ్మ అంటే క‌డుపులోంచి ప‌దం వ‌స్తుంది. మ‌మ్మీ అంటే గొంతులోనుంచి మాత్ర‌మే వ‌స్తుంది’ అని వ్యాఖ్యానించారు. తెలుగు వాడిగా తాను గ‌ర్విస్తున్నాన‌ని వెంక‌య్య‌నాయుడు అన్నారు. ప్ర‌పంచంలోని ఎన్నో సంస్థ‌ల‌కు అధిప‌తులుగా భారతీయులే ఉన్నార‌ని, అందులోనూ తెలుగు వారే ఎక్కువ‌గా ఉన్నార‌ని ఆయ‌న‌ చెప్పారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్య‌మ‌ని చెప్పారు. ఇంకా ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ఏపీ శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, మంత్రులు చిన రాజప్ప, నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్‌బాబు, ఎంపీ గల్లా జయదేవ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

కాగా విట్‌ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం 200 ఎకరాలు కేటాయించింది. తొలిదశలో వంద ఎకరాల్లో విట్‌ వర్సిటీ భవన నిర్మాణాలు చేపట్టనున్నారు. మెడికల్‌ జోన్‌ కింద డెంటల్‌, పారా మెడికల్‌, నర్సింగ్‌ కోర్సుల నిర్వహణకు అనుగుణంగా భవన నిర్మాణాలు చేపడతామని విట్‌ వైస్‌ఛాన్సలర్‌ విశ్వనాథన్‌ తెలిపారు.