పొరపాట్లు సరిదిద్దడానికే బిల్లు సవరణలు

 

ఎంపీలు, ఎమ్మెల్సీల విషయంతోపాటు అనేక అంశాలలో జరిగిన అన్యాయం, పొరపాట్లను సరిదిద్దడానికే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో సవరణలు తేవాలని అనుకుంటున్నామని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మరోసారి స్పష్టం చేశారు. ఈ అంశాన్ని కూడా రాజకీయం చేయాలని అనుకోవడం తగదని చెప్పారు. విభజన చట్ట సవరణను కొంతమంది మొండిగా వ్యతిరేకించడం మాత్రమే కాకుండా దుష్ప్రచారం కూడా చేస్తున్నారని ఆయన తెలిపారు. రాజ్యసభ ఎంపీల కేటాయింపులో తప్పు జరిగిందని, ఎమ్మెల్సీల విషయంలో కూడా పొరపాట్లు జరిగాయని, ఇంకా మరికొన్ని అంశాలలో పారపాట్లు జరిగాయని ఆయన చెప్పారు. ఏ రాష్ట్రం ఎంపీలు, ఎమ్మెల్సీలు ఆ రాష్ట్రంలోనే వుండాలని అనుకోవడం తప్పు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. విభజన చట్ట సవరణకు, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాకి సంబంధం లేదని, ఆ రెండూ వేరువేరు అంశాలని వెంకయ్య  వివరించారు.