దటీజ్ వెంకయ్య

 

రాష్ట్రంలో సొంతంగా బలపడటంపై బీజేపీ వ్యూహం రచిస్తోంది. పలువురు ప్రముఖులు, నాయకులను కమలం దిశగా నడిపించడంలో పార్టీ సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడు కీలక పాత్ర పోషిస్తున్నరు. కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ అంటూ.. ఆయనతో పలువురికి భేటీలు ఏర్పాటుచేయిస్తూ ఆకర్షిస్తున్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతోపాటు, తెలుగుదేశం పక్షాన ఉన్న ప్రముఖులను, తటస్థులనూ తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు బీజేపీ చేస్తోంది. 2012 డిసెంబర్‌లో తన ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలంటూ హీరో బాలకృష్ణకు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. అందుకు బాలయ్య కూడా సరే అన్నారు. కానీ వెళ్లొద్దని చంద్రబాబు చెప్పడంతో బాలయ్య వెనక్కి తగ్గారని అప్పట్లో వార్తలు వచ్చాయి. గత ఏడాది ఆగస్టులో మోడీ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ఆయనను కలిసిన కొద్దిమంది సినీ ప్రముఖుల్లో బాలకృష్ణ కూడా ఒకరు. ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరిని తమ పార్టీలో చేర్చుకోవడంలో బీజేపీ విజయం సాధించింది. తాజాగా హరికృష్ణపైనా 'కమలం' కన్ను పడినట్లు తెలుస్తోంది.

 

"విభజనను వ్యతిరేకించడంలో హరికృష్ణ నిజాయితీగా వ్యవహరించారు. ఆయన ఒక్కరే రాజ్యసభ సభ్యత్వం వదులుకున్నారు'' అంటూ వెంకయ్యనాయుడు తరచూ ప్రశంసలు కురిపిస్తుండటం గమనార్హం. ఇక... మోడీని పవన్ కల్యాణ్, నాగార్జున కలవడం (కలిసేలా చేయడం) వెనుక కూడా సీమాంధ్రలో సొంతంగా బలపడాలనే ఎజెండా ఉన్నట్లు తెలుస్తోంది. వెంకయ్య నాయుడి ఆహ్వానం మేరకే మోడీని కలిసినట్లు నాగార్జున స్వయంగా అంగీకరించారు. బుధవారం నాడు మోహన్ బాబు కూడా మోడీని కలుస్తున్నారు. ఆయనను కూడా వెంకయ్యే తెరమీదకు తీసుకొస్తున్నట్లు సమాచారం.