లోగుట్టు పెరుమాళ్ళకే కాదు నాకూ ఎరుకే...

 

సహకార ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘనవిజయం గురించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీడియాకు, పార్టీ అధిష్టానానికి ఏకరువు పెట్టడం చూసినవారికి, పార్టీలకతీతంగా సాగవలసిన సహకార ఎన్నికలు రాజకీయ నాయకుల కనుసన్నలలో ఏవిధంగా జరిగాయో కళ్ళకు కట్టినట్లు చూపుతుంది.

 

రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలలో వేలు పెట్టడమే ఒక తప్పనుకొంటే, వాటి మద్య పోరాటాలు, పొత్తులు మరో తప్పు. ఇవి చాలవన్నట్లు, ఒకే పార్టీలో మళ్ళీ రెండుమూడు వర్గాలుగా చీలిపోయి, డీసీసీబీ బోర్డు పదవులు, అధ్యక్షపదవుల కోసం లోపాయికారీ రాజకీయాలు చేసుకుపోతున్నారు. తనకు దక్కకపోయినా పరువలేదు కానీ, పార్టీలో తన ప్రత్యర్ధికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పదవులు దక్కకూడదనే పంతంతో కొందరు కోర్టులకి వెళ్లి స్టేలు తెచ్చుకొంటే, మరి కొంత మంది విపక్షాలతో చేతులు కలిపి తమ పార్టీ అభ్యర్డులకే ఎసరు పెడుతున్నారు.

 

మొన్న కంచికచర్ల మండలం, గొట్టుముక్కల గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు గుదే వెంకటేశ్వరరావు (బుజ్జి) నివాసంలో జరిగిన వేడుకల్లో, మంత్రి సారధికి, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావుకు మద్య నడిచిన ఈ సంభాషణ ఇటువంటి వాటికి ఒక చిన్నఉదాహరణ మాత్రమే.

 

మంత్రి సారధి: ఏమన్నా బాగున్నావా?

 

వసంత: ఆ.. ఏం బాగో.. ఒక పక్క నా ఐతవరం సొసైటీకి స్టే తీసుకువచ్చి, నన్ను ఎన్నికల్లో నిలబడకుండా చేసి, ఇప్పుడు బాగున్నావా అని అడగం వెటకారం కాకపొతే మేరేమిటి?

 

మంత్రి సారధి: అన్నా, నువ్వలా అనుకోమాకు. స్టే సంగతి నాకు నిజంగా తెలియదు. వేరెవరో తెచ్చి ఉంటారు.

 

వసంత: పిన్నమనేని వెంకటేశ్వరరావు నాకంతా చెప్పాడు. పోనీ, నీకు తెలియదని తినే ఈ భోజనం మీద ప్రమాణం చేసి చెపుతావా?

 

మంత్రి పార్ధ సారధి: కొంచెం అసహనంగా కదిలారు గానీ జవాబీయలేదు.

 

వసంత: అన్నా! మీరు పెద్దవాళ్లు. మమ్మల్ని ఆశీర్వదించాలి, కాని ఇలాగ శపించకూడదు.

 

ఇదొక చిన్న సొసైటీ కధ మాత్రమమే. ఇటువంటివి రాష్ట్రంలో చాలానే కుమ్ములాటల కధలు, జరిగాయి.