కేసీఆర్ ని ఓడించాలన్న హరీష్‌రావు.. త్వరలోనే కాంగ్రెస్ లో చేరిక.!!

 

తెరాస సీనియర్ నేత హరీష్‌రావు గురించి కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. త్వరలోనే హరీష్‌రావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలిపారు. హరీష్‌రావు, మా నాయకుడు రాహుల్ గాంధీతో టచ్ లో ఉన్నారని తెలిపారు. తెరాసలో అంతర్గత పోరు నడుస్తుందన్న ఆయన.. బావబామ్మర్దుల ఆధిపత్యంలో హరీష్ రావు పార్టీ వీడుతున్నారని వెల్లడించారు.

ఎలాగైనా తన మామ, సీఎం కేసీఆర్‌ను గజ్వేల్‌లో ఓడించాలని హరీష్‌రావు తనను కోరినట్లు ఆయన వెల్లడించారు. ఓ ప్రైవేట్‌ నెంబర్‌ నుంచి హరీష్‌రావు నిన్న తనకు ఫోన్‌ చేశారని.. త్వరలో జరగబోయే ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించాలని, అవసరమైన ఆర్థియ సాయం అందిస్తానని ఆయన తనతో అన్నట్టు ప్రతాప్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అన్ని బాధ్యతలను కేటీఆర్‌కే అప్పగిస్తూ కేసీఆర్‌ తన ఇజ్జత్ తీస్తున్నారని, ఆయన వైఖరితో రాజకీయ జీవితం లేకుండా పోతోందని హరీష్‌రావు చెప్పినట్లు ప్రతాప్‌ రెడ్డి తెలిపారు. కేసీఆర్‌ను ఓడించేందుకు కలిసి పనిచేద్దామన్నారని వివరించారు. ఆర్థికసాయం అందిస్తానని హరీశ్‌ చెప్పారని.. అవినీతి సొమ్ము తనకు వద్దని తిరస్కరించానన్నారు. ఈ వ్యాఖ్యలపై ఏ దేవుడిపైనైనా ప్రమాణం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. తనకు గజ్వేల్‌ ప్రజలు, యువత అండగా ఉన్నారని, కేసీఆర్‌ కుటుంబం మొత్తం వచ్చి ప్రచారం చేసినా విజయం తనదేనని ప్రతాప్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.