కేటీఆర్ పై ఈవీఎంల టాంపరింగ్‌ ఆరోపణలు

 

కేటీఆర్ ఈవీఎంల టాంపరింగ్‌ కి పాల్పడ్డారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు గజ్వేల్‌ ప్రజాకూటమి అభ్యర్థి వంటేరు ప్రతాపరెడ్డి. ఈవీఎంలు టాంపరింగ్‌కు పాల్పడుతున్నారన్న అనుమానం తమకు ఉందని గజ్వేల్‌ ప్రజాకూటమి అభ్యర్థి వంటేరు ప్రతాపరెడ్డి ఆరోపించారు. అందుకే 119 నియోజకవర్గాల్లో స్ట్రాంగ్‌రూంల వద్ద మంటలు పెట్టుకుని కాపలా కాసే పరిస్థితి నెలకొందన్నారు. ఈ మేరకు ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలోని లెక్కింపు కేంద్రం వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో 100 సీట్లు వస్తాయని చెప్పిన కేటీఆర్.. ఇప్పుడు 106 అని మాట్లాడడం వెనక మతలబు ఏంటని ప్రశ్నించారు. కేటీఆర్‌ ఐటీ మంత్రి కాబట్టి.. ఈవీఎంలకు, ఐటీకి దగ్గర సంబంధం ఉన్న నేపథ్యంలో ఆయన‌పై అనుమానం వ్యక్తంచేస్తున్నామన్నారు. అందుకే ఈసీకి ఫిర్యాదు చేశామని, వీవీప్యాట్‌లలోని స్లిప్‌లను లెక్కించాలని ఈసీని కోరుతున్నామని చెప్పారు. ఈసీ, టీఆర్‌ఎస్‌ కుమ్మక్కైనట్లు అనుమానం ఉందని ఆరోపించారు. తెలంగాణ ప్రజల అపోహలు ఈసీ తొలగించాలని వంటేరు ప్రతాప్‌రెడ్డి కోరారు. దీనిపై హైకోర్టుకు కూడా వెళ్ళటానికి సిద్ధమన్నారు.