రాధా దారికొచ్చినట్టేనా?.. జగన్ మాట వింటారా?

 

కృష్ణా జిల్లా వైసీపీ రాజకీయాలు రోజురోజుకి ఆసక్తికరంగా మారుతున్నాయి. విజయవాడ సెంట్రల్‌ నుంచి తాను పోటీ చేస్తానని వంగవీటి రాధా చెప్పడం.. దానికి వైసీపీ అధినేత జగన్‌ అంగీకరించకపోవడంతో.. ఆయన అలకపాన్పు ఎక్కారు. గత ఎన్నికల ఓటమి తరువాత నుంచే సెంట్రల్‌ లో పోటీ చేస్తానని వేరేచోట చెయ్యనని చెప్పినా.. అక్కడ మల్లాది విష్ణుకు సీటు ఇస్తామని ప్రకటించడం.. దీనిపై రాధా వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో రాధా వర్గీయుల ఆందోళనను జగన్‌ పెద్దగా పట్టించుకోలేదు. తాను చెప్పినట్లు మచిలీపట్నం పార్లమెంట్‌కు పోటీ చేయాలని లేదంటే ఎక్కడా టిక్కెట్‌ ఇచ్చేది లేదని ఆయన ఖరాఖండిగా చెప్పడంతో రాధా తన భవిష్యత్‌పై అనుచరులతో గత కొన్నాళ్లుగా చర్చిస్తున్నారు.

మచిలీపట్నంలో పోటీ చేస్తే ఓటమి ఖాయమని అక్కడ తనకు అంతగా పట్టుదలేదని, పైగా ఎంపీగా పోటీ చేయాలంటే భారీగా ఖర్చుపెట్టాలని, అది తన వల్ల కాదని భావిస్తోన్న రాధా అక్కడి నుంచి పోటీ చేయడం కంటే పార్టీ మారితే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఉన్నారు. దీనికి ఆయన అనుచరులు కూడా మద్దతు ఇచ్చారు. అయితే ఏ పార్టీలోకి మారాలనే దానిపై వారు మల్లగుల్లాలు పడ్డారు. అధికార టీడీపీలోకి వెళితే రాధా కోరినట్లు సెంట్రల్‌ సీటు ఇస్తారనే హామీ ఉన్నా.. ఆయన అనుచరుల్లో ఎక్కువ మంది టీడీపీలోకి వెళ్లడానికి ఇష్టపడలేదని తెలుస్తోంది. దానికి ప్రత్యామ్నాయంగా జనసేనలోకి వెళదామని భావించినా.. పవన్‌ ఏం చేస్తారో తెలియదని.. ఆయన రాజకీయాలు అంత సీరియస్‌గా లేవని.. ఇటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీలోకి వెళ్లి చేసేదేముందన్న అభిప్రాయం రాధాలో వ్యక్తమైందని ఆయన అనుచరులు చెబుతూ పార్టీ మారే దానిపై ఎటువంటి స్పష్టతను ఇవ్వలేకపోయారు.

అయితే నిన్నటి దాకా పార్టీలో తాము చెప్పిన చోట టిక్కెట్‌ ఇస్తామని అక్కడ పోటీ చేస్తే చేయి.. లేకపోతే వెళ్లిపోవచ్చునని రాధాకు చెప్పిన వైసీపీ పెద్దలు ఇప్పుడు ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో పోటీకి ఎవరూ ముందుకు రాకపోతుండడంతో రాధాను బుజ్జగించాలని వైసీపీ భావించిందని.. దానిలో భాగంగా సీనియర్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని విజయవాడ పంపించారని తెలుస్తోంది. ఆయన తాజాగా రాధాతో సమావేశమయ్యారని.. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే.. గెలుస్తావని, ఆర్థిక విషయాలు జగన్‌ చూసుకుంటారని హామీ ఇచ్చారని.. దీంతో రాధా మెత్తపడ్డారని ప్రచారం జరుగుతోంది. మరి దీనిపై రాధా వర్గం ఏమీ మాట్లాడడం లేదు. తాము అడిగిన సీటు ఇవ్వకుండా తమకు పట్టులేని చోట ఇస్తే ఎలా అనే మీమాంస వారిలో ఉంది. అయితే పార్టీ మారే అవకాశాలు లేకపోవడంతో ఇచ్చిన చోట పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్న భావన రాధా వర్గీయుల్లో ఉందని ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం.