బూతు పురాణంతో టీడీపీ అధ్యాయాన్ని ముగించిన వల్లభనేని వంశీ

 

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పై పార్టీ పరంగా దండయాత్ర మొదలైంది. తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ జగన్ రెడ్డికి మద్దతుగా నిలబడుతున్నట్లు వంశీ ప్రకటించారు. వెంటనే పార్టీ పరంగా వ్యూహం మొదలైపోయింది. వంశీ మీడియా సమావేశంలో జగన్ కు మద్దతు ప్రకటించే సమయానికి చంద్రబాబు ఇసుకకొరతపై దీక్ష చేస్తున్నారు.

వంశీ ఏకంగా చంద్రబాబు.. లోకేష్ తో పాటు పేర్లు చెప్పకుండానే కొందరి నేతలపై చేసిన కామెంట్లను నేతలు అధినేత దృష్టికి తీసుకెళ్ళారు. జిల్లా స్థాయిలో వంశీ అంటే పడని నేతలను ముందుగా గుర్తించే పనిలో పడ్డారు తెలుగు తమ్ముళ్లు. మొదటగా ఎంఎల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ కనబడ్డారు.

చంద్రబాబు ఆదేశానుసారం ప్రకారం రాజేంద్రప్రసాద్ గన్నవరం ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా టీవీ చర్చలో ఆరోపణలు మొదలుపెట్టేశారు. అయితే ఎంఎల్సీ ఊహించని విధంగా సదరు టివి చర్చలో వంశీ కూడా ప్రత్యక్షమయ్యారు. రాజేంద్రప్రసాద్ చేస్తున్న ఆరోపణలకు ఎమ్మెల్యే తన కౌంటర్ మొదలుపెట్టటంతో ఖంగుతిన్నారు. చివరకు రాజకీయ ఆరోపణలతో మొదలయి.. చివరకు వ్యక్తిగత దూషణలతో ముగిసింది.

వ్యక్తిగత విషయాలు ఒకరివి ఒకరు బయట పెట్టుకుంటూ చివరకు ఇద్దరు బూతులు తిట్టేసుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటి చేసిన బోడెప్రసాద్ దగ్గర ఎంఎల్సీ డబ్బులు తీసుకున్నాడని వంశీ ఆరోపిస్తే.. చంద్రబాబు దగ్గర ఎమ్మెల్యే డబ్బులు తీసుకున్నాడంటూ రాజేంద్రప్రసాద్ ఎదురుదాడి చేసాడు.కూతురు పెళ్ళికి కూడా రాజేంద్రప్రసాద్.. బాబు దగ్గర డబ్బులు తీసుకున్నాడంటూ మళ్ళీ వంశీ దాడి మొదలుపట్టారు. ఇలా ఒకరిగురించి మరొకరు వ్యక్తిగత విషయాలు బయట పెట్టుకుంటూ బూతుపురాణమే చదివారు. వీళ్ళ బూతులను భరించలేక చర్చా కార్యక్రమాన్నే ఛానల్ అర్ధాంతరంగా నిలిపేసింది.