టీడీపి ఖాళీ.. బై బై బాబు నినాదాన్ని సీరియస్ గా తీసుకుంటున్న టీడీపీ నేతలు

 

టీడీపీలో ఒకేరోజు రెండు ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. వంశీ, అవినాష్ పార్టీని వీడడం ఒకటైతే.. నిన్నటి ఆయన ఇసుక దీక్షకు మెజార్టీ ఎమ్మెల్యేల డుమ్మా కొట్టడం మరో అంశం. పార్టీలో జరుగుతున్న ఈ తాజా పరిణామాలపై చంద్రబాబు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా టిడిపి ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు. ఆ తర్వాత ఎంపీలతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై చర్చించనున్నారు. చంద్రబాబు ఏర్పాటు చేసిన సమావేశానికి అసలు ఎమ్మెల్యేలు ఎవరు హాజరవుతున్నారే విషయమే సందిగ్ధంగా మారింది.

ఇసుక కొరతపై నిరసనగా చంద్రబాబు దీక్ష చేశారు. ఈ సమయంలోనే కీలక నేతలు అవినాష్, వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేయటం.. అదే రోజు వైసిపిలో చేరటం కూడా జరిగిపోయాయి. వంశీ కూడా వైసీపీ లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు నడిచిన సస్పెన్స్ కు ఆయన తెర దించుతూ.. చంద్రబాబు, లోకేశ్, దేవినేని ఉమలను టార్గెట్ చేస్తూ  ఘాటైన విమర్శలు చేశారు.ఈ నేపథ్యంలోనే టిడిపి అధిష్టానం ఈరోజు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పార్టీకి చెందినటువంటి సీనియర్ నేతలు అందరిని ఉదయం తన నివాసానికి రావాలని ఆదేశించారు చంద్రబాబు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలు.. చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు తాజా రాజకీయ పరిణామాల గురుంచి చర్చించనున్నారు. 

వంశీ చేస్తున్నటువంటి విమర్శలను బట్టి చూస్తే.. ఇంకా మరికొంతమంది కీలకమైన నేతలు పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతుంది. టిడిపి అధిష్టానానికి ఈ ప్రచారం కొంత కలవరపాటుకి గురిచేసింది. ఎవరెవరు చర్చలు పాల్గొంటున్నారు.. ఎవరెవరు పార్టీ వీడబోతున్నారు అనే అంశాలపై చర్చించనున్నారు. టీడీపీ నుండి బీజేపీ,వైసీపీలోకి పెద్ద సంఖ్యలో నేతలు చేరబోతున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.