ఆమె మనసుని గెలుచుకోవాలంటే (వాలెంటైన్స్ డే స్పెషల్)

 

ప్రేమ చిగురించడం కష్టమేమీ కాదు. మన శరీరంలో హార్మోనులే ఆ పని చేసేస్తాయి. కానీ అలా మొగ్గలా మొదలైన ప్రేమ, ఓ అందమైన బంధంగా ముందుకు సాగాలంటే కాస్త కష్టపడాల్సిందే... అందుకోసం ఈ ఉపాయాలు తప్పకుండా మేలు చేకూరుస్తాయంటున్నారు ప్రేమపండితులు.

 

అభిరుచులు తెలుసుకోండి – ఈ విషయం గురించి మరోసారి చెప్పాల్సిన పని లేదు కానీ, మనసుని గెల్చుకునేందుకు రాచమార్గం ఇదే! అవతలి మనిషి అభిరుచులు, అభిప్రాయాలు తెలుసుకుంటూ... వాటికి అనుగుణమైన బహుమతులు ఇవ్వాలి. వాటి గురించి మనం కూడా ఎంతో కొంత జ్ఞానాన్ని సంపాదించుని ఓ నాలుగు మాటలు మాట్లాడే ప్రయత్నం చేయాలి.

 

సహజంగా ప్రవర్తించండి – అవతలివారిని ఇంప్రెస్ చేసే ప్రయత్నంలో కాస్త అతిగా ప్రవర్తిస్తూ ఉంటాము. తెలియని విషయం తెలిసినట్లుగా చెబుతూ, మన గురించి అతిశయోక్తులు చెప్పుకొంటూ గడిపే ప్రయత్నం చేస్తుంటాము. ఇలాంటి కృత్రిమమైన మాటలను తప్పకుండా పసిగట్టేస్తారు. అందులోనూ ఆడవారు మరింత అప్రమత్తంగా ఉంటారు. ఒకవేళ ఇలాంటి డాబుసరి మాటల మీద బంధం ముందుకు సాగినా, అది ఒడిదొడుకులకు లోను కాక మానదు.

 

సానుకూల దృక్పథం – జీవితం పట్ల సానుకూల దృక్పథం, ఎప్పుడూ చెరగని చిరునవ్వు, సమస్యని విశ్లేషించి సలహాని అందించగల మనస్తత్వం తప్పకుండా మీ పట్ల భరోసాని అందిస్తాయి. కేవలం ప్రియురాలే కాదు, మన చుట్టూ ఉండేవారు ఎవరైనా సరే తమతో పాటుగా ఓ పరిణతి కలిగిన మనిషి తోడుండాలనే కోరుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే, మీ పక్కన ఎలాంటివారు ఉండాలని మీరు అనుకుంటారో... అలా మెలిగేందుకు ప్రయత్నించండి.

 

గౌరవించండి – ప్రేమలో ఒకరుంటే సరిపోరు. ఆ బంధంలో ఇద్దరూ ఇమిడిపోవాలి. అందుకోసం అవతలివారిని గుర్తించి తీరాల్సిందే. వారి అభిప్రాయాలను, వ్యక్తిత్వాన్నీ గౌరవించాల్సిందే! స్త్రీలు తమని గౌరవించే మగవారినే అభిమానిస్తారు. పెత్తనం చెలాయించే మగవారికి భయపడతారు. మనకి కావల్సింది అభిమానమా, భయమా అని తేల్చుకోక తప్పదు.
ఆశ్చర్యపరచండి – ప్రేమలో ఎప్పటికప్పుడు తనని ఆశ్చర్యపరచండి. తను ఊహించన బహుమతినో, తను ఎదురుచూడని విందునో ప్లాన్ చేయండి. తన ఇష్టాలను కళ్ల ముందు ఉంచండి. తన కలలని నెరవేర్చే రాకుమారుడిలా మారిపోండి. తనని గెలిపించడంలోని తృప్తిని పొందండి.


ఆల్ ద బెస్ట్!!!
- నిర్జర.