పార్కు జంటలకి పెళ్లిళ్ళ రోజు నేడు

 

ఈ రోజు ప్రేమికుల దినోత్సవం జరుపుకోవడానికి ప్రేమ పక్షులు పార్కులకు, పబ్బులకీ వెళితే వారికి అక్కడే పెళ్లిళ్లు చేసేస్తామని విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ హెచ్చరిస్తున్నాయి. విదేశీ సంస్కృతికి అలవాటుపడ్డ యువత, ఇటువంటి ‘వాలెంటైన్స్ డే’ వంటివాటిని సాకుగా తీసుకొని విచ్చలవిడితనానికి అలవాటుపడి భారతీయ సంస్కృతిని మంటగలుపుతున్నారని తీవ్రంగా విమర్శించే ఆ రెండు హిందూసంస్థలు, ఇటువంటి ప్రేమ జంటలకి బుద్ది చెప్పేందుకు మంగళ సూత్రాలు, మట్టెలు, పసుపుకుంకుమలు వంటి పెళ్లి సామాగ్రిని దేశంలో అన్ని ప్రాంతాలలో సిద్ధం చేసుకొని ప్రేమపక్షులకోసం పార్కుల వద్ద, పబ్బులవద్ద ఎదురు చూస్తున్నాయి.

 

హైదరాబాదు పోలీసు కమీషనరు మాత్రం ప్రేమజంటలకి దైర్యం చెపుతూ మేమున్నామని అంటున్నారు. పార్కుల వద్ద ప్రేమికులను కాపాడేందుకు పోలీసులను కూడా ఏర్పాటు చేయనున్నారు.

 

గమ్మతయిన విషయం ఏమిటంటే, మిగిలిన రోజుల్లో పార్కుల్లో, బీచుల్లో ప్రేమ జంటలు కనిపిస్తే వారిని తరిమేసే పోలీసులే ఈ రోజు వారిని వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ ల నుండి కాపాడే బాద్యత తీసుకోక తప్పట్లేదు.

 

భజరంగ్ దళ్ నగర కన్వీనర్ భరత్ వంశీ, రాష్ట్ర కార్యదర్శి టి.యమన్‌సింగ్ హైదరాబాదులో తమ కార్యాయలంలో మీడియాతో మాట్లాడుతూ ప్రేమ జంటలను పట్టుకుని అందరి సమక్షంలో వారికి కౌన్సెలింగ్ నిర్వహించి, వారి తల్లి తండ్రులకు చెప్పి మరీ పెళ్లిళ్లు చేస్తామని అన్నారు.