వకీల్ సాబ్ పై వైసీపీ వార్! కలెక్షన్లు తగ్గేనా? 

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌  'వకీల్‌సాబ్‌' సినిమాపై ఏపీలో పొలిటికల్ వార్ సాగుతోంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జనసైనికులకు మధ్య యుద్దమే నడుస్తోంది. ఏప్రిల్‌ 9న వకీల్ సాబ్ సినిమా విడుదలైంది. హిట్‌ టాక్‌తో మంచి కలెక్షన్స్‌ను సాధిస్తూ బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు క్రియేట్‌ చేస్తుంది. తొలి రోజు రికార్డ్ కలెక్షన్ వచ్చాయంటున్నారు. సినిమా సూపర్ హిట్ అంటూ చర్చ జరిగినా..  తొలి రోజు సాయంత్రానికే  మరోలా ట్రెండ్ అయింది. వకీల్ సాబ్ డిజాస్టర్ అంటూ కొన్ని సీన్లను ట్రోల్ చేసి పడేశారు.  వకీల్ సాబ్ మీద వెంటనే నెగెటివ్ ట్రెండ్ ప్రచారం కావడంలో వైఎస్ జగన్ అభిమానులు ఉన్నారని తెలుస్తోంది. వైసీపీ కార్యకర్తల ట్రోలింగుతో మొదటి రోజుతో పోల్చితే.. రెండవ రోజుకు వకీల్ సాబ్ కలెక్షన్లు కొంత తగ్గాయంటున్నారు. 

రాజకీయంగా తమకు ప్రత్యర్థిగా ఉన్న పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ట్రోలింగుకు పాల్పడుతున్నారు. వకీల్ సాబ్ కలెక్షన్లు తగ్గించడమే లక్ష్యంగా రెచ్చిపోతున్నారు. వకీల్ సాబ్ సినిమాలో ముగ్గురు అమ్మాయిలకు న్యాయం చేస్తారు లాయర్ గా పవన్ కల్యాణ్. అయితే సినిమాలో ముగ్గురు అమ్మాయిలకు న్యాయం చేసిన పవన్ కల్యాణ్.. నిజ జీవితంలో మాత్రం ముగ్గురు అమ్మాయిలను మోసం చేశారంటూ వైసీపీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. పవన్ వివాహలకు సంబంధించి గతంలో ఓ ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ మాట్లాడిన మాటలను వైరల్ చేస్తున్నారు. సినిమాలో  పవన్ కల్యాణ్ డైలాగులకు కౌంటర్లుగా మీమ్స్ చేస్తూ పోస్టులు చేస్తున్నారు. 

అంతేకాదు గతంలో పవన్ కు వ్యతిరేకంగా కామెంట్లు చేసిన పూనమ్ కౌర్ పేరుతో  ఉన్న ఫేక్ ట్వీట్లను వైరల్  చేశారు. అందులో పూనమ్ కౌర్..  పవన్ కళ్యాణ్‌ను దారుణంగా ట్రోల్ చేసినట్టుంది. మంచి సినిమాలు చేస్తే.. మంచి పాత్రలు పోషిస్తే.. లోపల ఉన్న లక్షణాలు పోతాయా? అని చేసిన కర్మ ఊరికే పోతుందా? అని రకరకాలు ట్వీట్లు వేసింది. కానీ అవి తాను వేయలేదని అవన్నీ ఫేక్ అని పూనమ్ క్లారిటీ ఇచ్చింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాను ఎవరు చేసినా ఎంకరేజ్ చేయాలి. కానీ ఈ డిఫేమింగ్ ఆర్గనైజ్డ్ ట్రెండ్ ఏంటో? ఇప్పుడు ఎవరు చేస్తున్నారు కుళ్ళు రాజకీయాలు? అమ్మాయిలను డిఫేమ్ చేసి రాజకీయాలు చేస్తే తప్పు కాదు. అమ్మాయిలను రక్షించే సినిమా తీస్తే ప్రాబ్లెమ్ ఎవరికి అంటూ ప్రశ్నించింది. సినిమా - రాజకీయాల మధ్య సంబంధం అనేది ప్రజలకు ఉపయోగపడాలి. . సినిమా- రాజకీయం కలిసి కాపురం చెయ్యకపోతే ఫీల్ అయ్యేది మాత్రం చూస్తున్న జనాలు. అందుకే కుళ్లు రాజకీయాలు మానేయాలి అంటూ పునమ్ ఫైరైంది. 

వకీల్ సాబ్ సినిమాకు మొదటి నుంచి అడ్డంకులే స్పష్టిస్తోంది జగన్ రెడ్డి సర్కార్. మాములుగా పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుంటే.. బెనిఫిట్ షోలు, అదనపు షోలతో పాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఉంది. గతంలో చాలా సినిమాలకు ఈ అవకాశం వచ్చింది. కాని పవన్ కల్యాణ్ వకీల్ సాబ్‌ పై కక్ష కట్టిన జగన్ సర్కార్.. బెనిఫిట్ షోలు రద్దు చేసింది. ఇందు కోసం ఏపీలోని అధికారులు కొన్ని జీవోలను విడుదల చేశారు. టికెట్ల బుకింగ్ ముగిశాకా బెనిఫిట్ షోలు రద్ద చేయడం రచ్చగా మారింది. అంతేకాదు గతంలో చాలా సినిమాలకు మూడు రోజుల పాటు టికెట్ల ధరలు పెంచుకునే అవకాశం ఇచ్చారు. గత నెలలో విడుదలైన ఉప్పెన సినిమాకు కూడా టికెట్ రేట్లు పెంచారు. ఇప్పుడు వకీల్ సాబ్ కు మాత్రం జగన్ సర్కార్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. 

ప్రత్యేకంగా టికెట్ రేట్లు పెట్టి.. అంతకు మించి అమ్మినా, పెంచినా.. థియేటర్ లైసెన్స్‌లు క్యాన్సిల్ చేస్తామని అధికారులు బెదిరించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఇదంతా వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా చేస్తుందని, రాజకీయ కక్షను సినిమా మీద చూపిస్తున్నారని అభిమానులు డా ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సర్కార్ తీరుపై  వకీల్ సాబ్ సినిమా టిక్కెట్లకు సంబంధించి డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమానులు కొందరు ఏపీ హైకోర్టు‌ను ఆశ్రయించారు. కోర్టు వారికి సానుకూలంగా తీర్పును ఇస్తూ ఆర్డర్స్ జారీ చేసింది.. మూడు రోజుల పాటు టికెట్స్ రేట్స్ పెంచుకోవచ్చంటూ సింగిల్ జడ్జ్ తీర్పు ఇచ్చారు. ఏపీలోని 13 జిల్లాల జాయింట్ కలెక్టర్స్‌కు, అలాగే ఏపీ ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇచ్చారు. 

వైసీపీ ప్రభుత్వం పవన్ మీద కక్ష సాధిస్తోందని ఫ్యాన్స్  అంటుంటే.. సినిమాటోగ్రఫీ యాక్ట్‌ ప్రకారం రోజూ 4 షోలకే అనుమతి ఉందని మంత్రి పేర్ని నాని అన్నారు. 'మీకు దురద ఉందని, మోజు ఉందని తెల్లవారుజామున 5 గంటలకు వెళ్తే షో వెయ్యరు సునీల్ గారు' అంటూ ఎద్దేవా చేశారు. స్పెషల్ షోకు పర్మీషన్ ఇవ్వలేదని సునీల్ దియోధర్ ఏడుస్తున్నారని.. అసలు ఆ షోకు ఆ టికెట్ రేటు ఎంతో తెలుసా అని ప్రశ్నించారు పేర్నీ నాని. అయితే ఏం దురద వచ్చిందని గతంలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చారని పవన్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. గత నెలలో విడుదలైన సినిమా టికెట్లు పెంచుకునేలా ఎందుకు అవకాశం ఇచ్చారో మంత్రి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రిగారి నీతులు అందరికి వర్తిస్తాయా లేక కొందరికేనా అంటూ సెటైర్లు వేస్తున్నారు జన సైనికులు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా.. వకీల్ సాబ్ రికార్డులను ఆపలేరని చెబుతున్నారు.