కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ.. వైఎస్ కూడా ఇలా చేయలేదంటూ రేవంత్ పై ఫైర్!!

 

తెలంగాణ కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం హాట్ హాట్ గా జరిగింది. హుజూర్ నగర్ లో పార్టీ ఓటమిపై చర్చకు జరగగా  ఓటమికి బాధ్యత తనదే అంటూ పీసీసీ చీఫ్ ఉత్తమ్ ప్రకటించారు. ఇక పార్టీలో రేవంత్ దూకుడుపై సీనియర్ నేత వీహెచ్ ఇండైరెక్ట్ గా అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీలో కట్టు దాటిన వారి పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందేనని కోరారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు ఇచ్చేందుకు కోర్ కమిటీ ఆమోదం తెలిపింది. సుదీర్ఘ కాలం తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సమావేశం గాంధీ భవనలో జరిగింది. కోర్ కమిటీ ఎజెండా అంశాలు ఆర్టీసీ కార్మికుల సమ్మె, మున్సిపల్ ఎన్నికలు అయినప్పటికీ మరి కొన్ని అంశాలు చర్చకు వచ్చినట్టు తెలిసింది.

సమావేశం ప్రారంభమవ్వగానే హుజూర్ నగర్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత తనదే అంటూ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. దీంతో కోర్ కమిటీ సభ్యులు ఉత్తమ్ కు అండగా నిలిచినట్లు సమాచారం. నేతలెవ్వరూ ప్రకటించకుండానే ఓటమికి బాధ్యత తనదే అని ఉత్తమ్ తెలివిగా ప్రకటించారని మరో నేతకు నిలదీసే అవకాశం ఇవ్వకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారనే చర్చ పార్టీలో జరుగుతోంది. మరోవైపు పార్టీలో క్రమశిక్షణపై వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం, కొంతమంది నేతలు పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారట. ప్రగతి భవన్ ముట్టడి విషయంలో ముగ్గురు నేతలే నిర్ణయం తీసుకున్నారని గతంలోనే బాహాటం గానే విమర్శించిన వీహెచ్ ఈ విషయాన్ని ప్రస్తావించకుండా పరోక్షంగా క్రమశిక్షణ పేరుతో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడినట్లు తెలిసింది.

వైయస్ కూడా ఎప్పుడూ సీఎం కాకముందు తన కార్యకర్తలతో సీఎం అనిపించలేదని కానీ పార్టీలో ఒక నేత సభలు సమావేశాల సమయంలో సీఎం అని తన కార్యకర్తలతో అనిపించుకుంటారని ఇది మంచి పద్ధతి కాదని నేత పేరు చెప్పకుండా పరోక్షంగా విమర్శించారని సమాచారం. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలని సూచించారట. కుంతియా సైతం ఆయన వ్యాఖ్యలతో ఏకీభవించినట్లు చెబుతున్నారు. ఇక కోర్ కమిటీ ఎజెండా ప్రకారం మున్సిపల్ ఎన్నికలు ఆర్టీసీ సమ్మె విషయంలో కాంగ్రెస్ ఏం చేయాలనే దానిపై నేతలు చర్చించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటికే మైనారిటీలకు, బీసీలకు యాభై శాతం సీట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.

దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఆ బాధ్యతలను నియోజక వర్గ ఇన్ చార్జిలకు అప్పగించాలని డిసైడ్ అయ్యారు. ఇక నియోజక వర్గ ఇన్ చార్జిలు లేని చోట వెంటనే భర్తీ చేయాలని తీర్మానించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ఇస్తూ వారి కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక కోర్ కమిటీ సమావేశం అనంతరం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. మోదీ నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ పతనం అవుతోందంటూ ఏఐసీసీ అధికార ప్రతినిధి గౌరు వల్లభ్ పార్టీ నేతలకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వ తప్పిదాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని పార్టీ నేతలు నిర్ణయించారు.

కేంద్ర వైఫల్యాలపై పోరు బాట పట్టాలని తీర్మానించారు. అందులో భాగంగా నవంబర్ ఐదున అన్ని జిల్లా కేంద్రాల్లో మీడియా సమావేశాలు నవంబర్ పదిహేను న గాంధీ భవన్ నుంచి హైదరాబాద్ కలెక్టరేట్ వరకు పాద యాత్ర నిర్వహించాలని కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ఆర్టీసీ జేఏసీ తల పెట్టిన సభకు కాంగ్రెస్ శ్రేణులు హాజరు కావాలని కోర్ కమిటీ పిలుపు నిచ్చింది. సభకు పార్టీ పక్షాన నేతలు హాజరు కావాలని నిర్ణయించారు. మొత్తంగా కోర్ కమిటీ సమావేశం వాడి వేడిగానే జరిగినట్లు తెలుస్తోంది.