కేసీఆర్‌ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోంది

 

నిజామాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ తొమ్మిది స్థానాల్లో గెలుస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. కామారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్‌ ప్రజాగర్జన సభలో ఆయన ప్రసంగిస్తూ కేసీఆర్‌ పాలనపై విమర్శలు గుప్పించారు.

" కేసీఆర్‌ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోంది. ఆ డబ్బు ప్రభావంతో ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ సమాజం కాంగ్రెస్‌ కోసం ఎదురు చూస్తోంది. డిసెంబర్‌ 12న ఏర్పాటయ్యేది కాంగ్రెస్‌నేతృత్వంలో ప్రభుత్వమే. యావత్‌ తెలంగాణ రైతాంగానికి 2లక్షల రుణ మాఫీ చేస్తాం. నిజామాబాద్‌ జిల్లాలో నిజాం షుగర్‌ ఫ్యాక్టరీకి ఎంత పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉన్నా.. మా ప్రభుత్వం ఆ ఫ్యాక్టరీని తెరిపిస్తుందని కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాట ఇస్తున్నా. బీడీ కార్మికుల దుస్థితికి కారణం కేసీఆర్‌, మోదీ ఘన కార్యమే. జీఎస్టీ 28శాతం పెట్టి కార్మికులకు ఉపాధి లేకుండా చేశారు. బీడీలపై 28శాతం పన్ను విధించి వారి పొట్ట గొట్టారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రూ.500 కోట్లతో గల్ఫ్‌ బాధితుల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తాం. అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే ప్రభుత్వరంగంలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఉద్యోగాలు దక్కనివారికి నెలకు రూ.3వేలుచొప్పున నిరుద్యోగ భృతి కల్పిస్తాం. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ఇచ్చే పింఛను రెట్టింపు చేస్తాం" అని అన్నారు.

"రేషన్‌ పద్ధతిలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం. కుటుంబంలో ప్రతిమనిషికి 7కిలోల సన్నబియ్యం ఇస్తాం. వాటితో పాటు తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను ఇస్తాం. తెలంగాణలో దళితులు, గిరిజనులకు మేలు చేసే విధంగా తెల్లకార్డు ఉన్నవారందరికీ సన్నబియ్యంతో సహా తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను ఉచితంగా ఇస్తాం. వారి ఇళ్ల అవసరాలకు వాడే 200 యూనిట్ల విద్యుత్‌ ఉచితంగా ఇస్తాం. కాంగ్రెస్‌ పాలనలో ఒక వ్యక్తి, కుటుంబ పాలనకు అవకాశం ఉండదు.. సామాజిక న్యాయం ఉంటుంది. రైతులకు మద్దతు ధరతో పాటు రాష్ట్ర బడ్జెట్‌ నుంచి బోనస్‌ కేటాయించి రైతులు పండించిన పంటలను మంచి ధరలకు కొనుగోలు చేస్తాం’’ అని ఉత్తమ్‌ ప్రకటించారు.