కేసీఆర్‌ చేసింది ఆమరణ దీక్ష కాదు.. దొంగ దీక్ష

తెరాస అధినేత,అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు.గాంధీభవన్‌లో జరిగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ కాంగ్రెస్‌ సమావేశంలో ఆయన పాల్గొన్నారు  ఈ నేపథ్యంలో ‘చావు నోట్లో తలపెట్టి వచ్చానంటూ పదేపదే చెబుతున్న కేసీఆర్‌ అప్పట్లో నిమ్స్‌లో చేసింది ఆమరణ దీక్ష కాదు.. దొంగ దీక్ష’ అంటూ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. నిమ్స్‌లో ఉన్నన్ని రోజులు దొంగచాటుగా ఫ్లూయిడ్లు, ఇంజక్షన్లు, న్యూట్రియెంట్లు తీసుకున్నారని ఆరోపించారు.నిమ్స్‌ ఆసుపత్రి రికార్డులే ఈ విషయాన్ని చెబుతున్నాయంటూ ఓ నివేదికను బహిర్గతం చేశారు.నిజామాబాద్‌ సభలో తన గురించి అడ్డగోలుగా మాట్లాడారని మండిపడ్డారు.

 

 

చైనా, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో మిగ్‌-21, 23 విమానాల ద్వారా దేశ రక్షణ బాధ్యతల్ని నేను నిర్వర్తించాను. అప్పట్లో కేసీఆర్‌ దుబాయ్‌కు దొంగ పాస్‌పోర్టులు, వీసాలు ఇప్పించే బ్రోకర్‌గా, ఏజెంట్‌గా చేసింది నిజం కాదా? ఇదే కేసులో దిల్లీలో పోలీస్‌ఠాణాలో కేసీఆర్‌ను కూర్చోబెడితే.. అప్పట్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎమ్మెస్సార్‌ ఫోన్‌ చేసి విడిపించింది వాస్తవం కాదని చెప్పే ధైర్యముందా? తెలంగాణ ఉద్యమ సమయంలో అమెరికాలో ఉన్న నా కొడుకు, కూతురు ఇక్కడికి తిరిగి రారని చెప్పి.. ఇప్పుడు అధికారం కోసం అడ్డదారులు తొక్కుతున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు.హరీశ్‌రావు, కవితకు కేంద్రమంత్రి మంత్రి పదవులు కట్టబెట్టేందుకు, కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు కేసీఆర్‌ పాట్లు పడుతున్నారు. అందుకే భాజపాతో జట్టు కట్టారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో, కేంద్రంపై అవిశ్వాసం సమయంలో భాజపాకు అనుకూలంగా ఓటు వేయడమే ఇందుకు నిదర్శనం. మోదీ గ్రాఫ్‌ కూడా పడిపోతుండటంతో కేసీఆర్‌ మద్దతు తీసుకుంటున్నారు. ఈ పార్టీల కుతంత్రాల్ని ఓటర్లు తిప్పికొట్టాలి. తమకు సంతానం లేదని.. తాను, తన సతీమణి తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తున్నామన్నారు. జాతీయ నాయకుల జయంతి రోజున వారి విగ్రహాలకు పూలమాలల వేసే తీరిక కూడా కేసీఆర్‌కు లేదని ఉత్తమ్‌ విమర్శించారు. 50 శాతానికి పైగా ఓట్లున్నట్లు చెప్పుకుంటున్న కేసీఆర్‌‌.. మహా కూటమిని చూసి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.

కేసీఆర్‌ పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని, రెండు నెలలు కష్టపడితే కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.రాబోయే ఎన్నికల్లో హైదరాబాద్‌ జిల్లాలోని 15 సీట్లలో 10కి తగ్గకుండా కాంగ్రెస్‌ గెలుచుకోవాలి. నగరానికి కేసీఆర్‌ చేసిందేమీ లేదు. విమానాశ్రయం, ఓఆర్‌ఆర్‌, పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే, కృష్ణా, గోదావరి జలాలు, మెట్రోరైలు, ప్రపంచస్థాయి సదుపాయాలు అన్ని గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలే సాధించాయి. ఆ విషయాలను కాంగ్రెస్‌ కార్యకర్తలు పాదయాత్ర ద్వారా ఇంటింటికి వెళ్లి వివరించాలి. కేసీఆర్‌ హఠావో.. తెలంగాణ బచావో నినాదంతో ప్రచారం చేయాలి.’’ అని ఉత్తమ్‌ అన్నారు.