ఉత్తమ్ మౌనవ్రతం... గాంధీభవన్లో వింత చర్చ...

హుజూర్ నగర్ లో తన భార్య పద్మావతి దారుణ ఓటమి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా లోప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నట్లు గాంధీభవన్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. తన కంచుకోట హుజూర్ నగర్ లో పార్టీని గెలిపించుకోలేకపోవడంతో ఉత్తమ్ తీవ్ర డిప్రెషన్ కు లోనయ్యారని, అందుకే, పార్టీ కార్యకలాపాల్లో అప్పటిలాగా పెద్దగా ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. హుజూర్ నగర్ ఓటమి తర్వాత సోనియాను కలిసి తనను పీసీసీ అధ్యక్ష పదవిని తప్పించాలని స్వయంగా కోరిన ఉత్తమ్... గాంధీభవన్ మీటింగ్స్ లో కూడా పెద్దగా పాల్గొనడం లేదని చెబుతున్నారు.

ఎయిర్ ఫోర్స్ లో కెప్టెన్ గా, ఆ తర్వాత రాష్ట్రపతి భవన్ లో పనిచేసిన ఉత్తమ్... కాంగ్రెస్ హైకమాండ్ అండదండలతో రాష్ట్ర రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1999 నుంచి ఇప్పటివరకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. రెండుసార్లు కోదాడ నుంచి... మూడుసార్లు హుజూర్ నగర్ నుంచి... అలా, 1999 నుంచి 2018 వరకు ఐదుసార్లు వరుసగా విజయం సాధించిన ఉత్తమ్, 2014లో తన భార్యను కూడా ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. అయితే, పార్టీ ఆదేశం మేరకు నల్గొండ ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. ఇంతవరకూ అప్రతిహతంగా సాగిన ఉత్తమ్ రాజకీయ ప్రయాణంలో మొదటిసారి ఎదురుదెబ్బ తగిలింది. ఎంపీగా గెలవడంతో...తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఉత్తమ్.... ఉప ఎన్నికల్లో తన భార్య పద్మావతిని బరిలోకి దించి...ఘోరంగా ఓటమిని చూశారు. హుజూర్ నగర్ నుంచి హ్యాట్రిక్ కొట్టి తన కుటుంబానికి కంచుకోటగా మార్చుకున్న హుజూర్ నగర్ లో తన భార్యను గెలిపించుకోలేకపోవడంతో ఉత్తమ్ కి ఇబ్బందికరంగా మారింది.

2014లో హుజూర్ నగర్ నుంచి తాను గెలవడమే కాకుండా, తన భార్యను కోదాడ నుంచి గెలిపించుకున్న ఉత్తమ్..... 2018 ఎన్నికల్లో పీసీసీ చీఫ్ హోదాలో ఉన్నప్పటికీ... తిరిగి తన సతీమణిని గెలిపించుకోలేకపోయారు. దాంతో, తన భార్యను కూడా గెలిపించుకోలేకపోయారన్న అపవాదును ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక, ఇఫ్పుడు హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో మరోసారి ఘోర పరాజయం ఎదురవడంతో తీవ్ర అవమానంగా పార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకే, హుజూర్ నగర్ ఫలితం తర్వాత అటు గాంధీభవన్ కు... ఇటు సొంత నియోజకవర్గానికి ముఖం చాటేస్తున్నారని మాట్లాడుకుంటున్నారు. ఉత్తమ్ ఉంటే హైదరాబాద్ లో... లేదంటే ఢిల్లీలో... ఈ రెండూ కాకపోతే కోదాడలో ఉంటున్నారని... కానీ హుజూర్ నగర్ వైపు కూడా చూడటం లేదని అంటున్నారు.