షాకింగ్ న్యూస్.. అప్పుల ఊబిలో అమెరికా.. భారత్ కు బాకీనే 

ప్రపంచ దేశాలలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న ఏకైక అగ్ర రాజ్యం అమెరికా. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ అమెరికా పెద్దనకు కూడా అప్పులు .విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇదే సమయంలో అమెరికా భారత్‌కు ఏకంగా 216బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారుగా రూ. 15లక్షల కోట్లు రుణపడి ఉందని సమాచారం. ఇదేదో గాలి వార్త కానే కాదు. ఆ దేశ చట్టసభల సభ్యుడు స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు. దాదాపు సంవత్సరం క్రితం అమెరికాపై కరోనా వైరస్ పంజా విసరడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆ దేశ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ 1.9 ట్రిలియన్ డాలర్ల భారీ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు. తాజాగా అక్కడి చట్టసభల సభ్యులు ఈ ఉద్దీపన ప్యాకేజీపై చర్చిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆ దేశ దిగువసభ సభ్యుడు అలెక్స్ మూనీ ఈ వివరాలు వెల్లడించారు. అమెరికా అప్పుల ఊబిలో కూరుకుపోతోందంటూ ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 2020 నాటికె అమెరికా అప్పులు 23.4 ట్రిలియన్ డాలర్లు ఉన్నాయని.. అవి ప్రస్తుతం 29 ట్రిలియన్ డాలర్లకు చేరాయని అయన తెలిపారు. మరోపక్క చైనా, జపాన్ దేశాలకు కూడా అమెరికా ట్రిలియన్ డాలర్లపైన బాకీ పడిందని అయన ఆందోళన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో 1.9ట్రిలియన్ డాలర్ల కొత్త ఉద్దీపన ప్యాకేజీని ఆమోదించే ముందు.. దేశ అప్పులను దృష్టిలో పెట్టుకోవాలని ఆయన జో బైడెన్ కు సూచించారు.