నా బెస్ట్ ఫ్రెండ్ మోడీకి గిఫ్ట్ ఇస్తున్నా: ట్రంప్

కరోనా పై పోరులో భారత్ కి అండగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ విజ్ఞప్తి మేరకు మోడీ సర్కార్ గత నెల 50 మిలియన్ హైడ్రాక్సీక్లోరోక్విన్ టాబ్లెట్స్ అమెరికాకు పంపించిన సంగతి తెలిసిందే. ఆ సాయాన్ని మనసులో పెట్టుకున్న ట్రంప్.. మనదేశానికి వెంటిలేటర్లను డొనేట్ చేయాలని నిర్ణయించారు.

కరోనా కష్టకాలంలో భారత్‌కు అండగా ఉంటామని ట్రంప్ ట్వీట్ చేశారు. భారత్ కి వెంటిలేటర్లను విరాళంగా ఇస్తామని ప్రకటించారు. వ్యాక్సిన్ తయారీలోనూ రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. రెండు దేశాల్లోనూ గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారని కొనియాడారు. అమెరికాలో చాలామంది భారతీయులు ఉన్నారని.. వారు వ్యాక్సిన్‌ తయారీలో పాలుపంచుకుంటున్నారని తెలిపారు. రెండు దేశాలు కలిసికట్టుగా పనిచేసి కనిపించని శత్రువును ఓడిస్తామని ట్రంప్ ట్వీట్ చేశారు. 

అంతేకాదు.. తనకు భారత్ ప్రధాని మోడీ మంచి స్నేహితుడని చెప్పుకొచ్చారు. కరోనాను అరికట్టడంలో భాగంగా మేము, మోదీ కలిసి పని చేస్తున్నాం అన్నారు. కరోనా వ్యాక్సిన్‌ తయారీలో రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని.. కరోనా వ్యాక్సిన్‌ ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.