విదేశీ విద్యార్థుల‌కు ట్రంప్ సర్కార్ భారీ షాక్‌

అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా పలు విద్యా సంస్థలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికాలోనూ కొన్ని విద్యా సంస్థలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. అయితే, ఆన్ లైన్ క్లాసుల్లో పాల్గొంటున్న విదేశీ విద్యార్థులు తమ దేశంలో ఉండాల్సిన పనిలేదని అమెరికా ప్రకటించింది. 

నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసా(ఎఫ్‌-1 ,ఎం-1 తాత్కాలిక ప్రాతిపదికన జారీ చేసేవి) మీద ప్రస్తుతం అమెరికాలో ఉండి ఆన్‌లైన్‌ క్లాసులు వింటున్న వాళ్లు దేశం విడిచి వెళ్లాలని ప్రకటించింది. ఆన్ లైన్ క్లాసుల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు దేశం విడిచి వెళ్లాలని, ఒక వేళ అలాంటి విద్యార్థులు దేశంలోనే ఉంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఐసీఈ) హెచ్చరించింది. అదే విధంగా కొత్తగా విద్యార్థి వీసాలు జారీ చేయబోమని పేర్కొంది. ఆన్‌లైన్ చ‌దువుల కోసం రిజిస్టర్ చేసుకున్న విద్యార్థుల‌కు వీసాలు ఇవ్వ‌మ‌ని, అలాంటి విద్యార్థుల‌ను యూఎస్ క‌స్ట‌మ్స్ అండ్ బోర్డ‌ర్ ప్రొటెక్ష‌న్ ప‌ర్మిట్ దేశంలోకి రానివ్వ‌ద‌ని ఐసీఈ స్ప‌ష్టం చేసింది.