వ్యాక్సిన్ తీసుకున్న మరునాడే హెల్త్ వర్కర్ మృతి.. 

ప్రజలంతా ఎపుడెపుడా అని ఎదురు చూసిన కరోనా వ్యాక్సినేషన్ ప్రోగ్రాం మొన్న శనివారం మొదలై.. దేశ వ్యాప్తంగా స‌జావుగా కొనసాగుతోంది. వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్ వ‌ర్క‌ర్స్ అందరు సేఫ్ అని అధికారులు ప్ర‌క‌టిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న చాలా మంది త‌మ‌కు ఎలాంటి ఇబ్బంది లేద‌ని చెప్తుండ‌గా… కొంత మంది మాత్రం క‌ళ్లు తిర‌గ‌టం వంటి సమస్యలు ఉన్నాయని చెప్పారు.

 

ఇది ఇలా ఉండగా తొలిరోజు వ్యాక్సిన్ తీసుకున్న ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లా ఆసుపత్రి వార్డు బాయ్ ఆ మరుసటి రోజు మృతి చెందాడు. వార్డు బాయ్ మహిపాల్ సింగ్ "కోవిషీల్డ్" వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత శ్వాస సంబంధిత ఇబ్బందులు, ఛాతీనొప్పి వంటి సమస్యలను ఎదుర్కొన్నాడు. దీనిపై హాస్పిటల్ చీఫ్ మెడికల్ అధికారి వివరణ ఇస్తూ.. మహిపాల్ సింగ్ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నాడని, అయితే ఒక రోజు తర్వాత శ్వాస ఆడక ఛాతీనొప్పితో బాధపడ్డాడని తెలిపారు. వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత అతను నైట్ షిఫ్ట్ చేశాడని, అయితే వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్‌ తో అతను మరణించినట్టు తాము అనుకోవడం లేదని అయన చెప్పారు. మహిపాల్ సింగ్ మృతికి గల కారణం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని అయన తెలిపారు.

 

మరోపక్క అతనికి ఎలాంటి ఆరోగ్య స‌మస్య‌లు లేవ‌ని మహిపాల్ కుటుంబ స‌భ్యులు చెపుతుండగా… వ్యాక్సిన్ వ‌ల్లే ఇలా జ‌రిగింద‌ని ఇప్పుడే చెప్ప‌లేమ‌ని డాక్ట‌ర్లు చెపుతున్నారు. మృతుడి బాడీని పోస్ట్ మార్టం కోసం పంపామ‌ని… త్వ‌ర‌లో మ‌ర‌ణానికి కార‌ణం తెలుస్తుందని అధికారులు తెలియ చేస్తున్నారు.