హోంగార్డ్ ల జీవితాలపై నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న యూపీ సర్కార్...

 

యూపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరవై ఐదు వేల మంది హోంగార్డులను తొలగించింది. అదేమంటే బడ్జెట్ లేదని చెబుతున్న ప్రభుత్వ సమాధానం కలకలం రేపుతోంది. కానిస్టేబుళ్లతో సమానంగా హోంగార్డులకు జీతాలు ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశాలివ్వడంతో బడ్జెట్ లేదని ఉద్యోగాలకే ఎసరు పెట్టింది యోగి సర్కార్.

ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మొత్తం ఇరవై ఐదు వేల మంది హోంగార్డులను విధుల నుంచి తొలగిస్తూ యోగి ఆదిత్య నాథ్ ప్రభుత్వం ప్రకటన చేసింది. తగినంత బడ్జెట్ లేని కారణంగా దీపావళికి ముందే ఇంత భారీ సంఖ్యలో హోంగార్డులను తొలగించడం సంచలనమైంది. యూపీ ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి అధ్యక్షతన ఆగస్టు ఇరవై ఎనిమిదిన జరిగిన సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రయాగ్ రాజ్ లోని యూపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

రాష్ట్రంలోని పోలీస్ కానిస్టేబుళ్లతో సమానంగా హోంగార్డు కూడా వేతనాలు చెల్లించాలని సుప్రీం కోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. గతంలో హోంగార్డులకు రోజుకు ఐదు వందల రూపాయల వేతనం చెల్లించేవారు. ఈ తీర్పుతో ఆ వేతనాన్ని ఆరు వందల డెబ్బై రెండు రూపాయలకు పెంచాల్సి వచ్చింది. బడ్జెట్ పరిమితంగా ఉన్న తరుణంలో ఇరవై ఐదు వేల మంది హోంగార్డు విధుల నుంచి రిలీవ్ ఆవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.తొంభై తొమ్మిది వేల మంది హోమ్ గార్డుల పనిదినాలని సైతం తగ్గించింది. గతంలో ఇరవై ఐదు రోజులుగా ఉన్నవారి పనిదినాల్ని పదిహేను రోజులకు తగ్గించింది. దీంతో దీపావళికి ముందే వేలాది కుటుంబాలలో చీకట్లు అలుము కున్నటైంది.యూపీ సర్కార్ తీసుకున్న సంచలన నిర్ణయాలకు బలైపోతున్న హోంగార్డ్ జీవితాలకు సమాధానం దొరుకుతుందో లేదో చర్చనీయాంశంగా మారింది.