భర్తకు భార్యనుంచి భరణం! యూపీ ఫ్యామిలీ కోర్టు సంచలనం 

చట్టం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సందర్భాలు సమయానుసారం మారుతుంటుంది. ఉత్తర్ ప్రదేశ్ లో ఓ కోర్టు అలానే ఓ డిఫరెంట్ తీర్పు ఇచ్చింది. సాధారణంగా విడాకుల కేసుల్లో భర్త విడిపోయే భార్యకు భరణంగా నెలనెలా ఇవ్వాలని కోర్టులు సూచిస్తుంటాయి. అయితే ఉత్తరప్రదేశ్ లోని ముజఫరాబాద్ ఫ్యామిలీ కోర్టు మాత్రం భార్య షాక్ ఇచ్చింది. భ‌ర్త‌కు భ‌ర‌ణం చెల్లించాల‌ని ఆదేశాలు ఇచ్చింది. 

 

ముజఫరాబాద్ ఫ్యామిలీ కోర్టుకు ఓ జంట వెళ్లింది. చాలా ఏళ్లుగా వేర్వేరుగా ఉంటున్న ఆ భార్యాభ‌ర్త‌లు త‌మ‌కు విడాకులు ఇవ్వాల‌ని కోరారు. హిందూ వివాహ చ‌ట్టం-1955  కింద ప్ర‌భుత్వ పెన్ష‌న‌ర్ అయిన భార్య నుంచి త‌న‌కు భ‌ర‌ణం ఇప్పించాల‌ని.. ఆమె భ‌ర్త 2013లో పిటిష‌న్ దాఖ‌లు చేశాడు. దీనిపై ఏడేళ్ల పాటు విచార‌ణ చేసిన ఫ్యామిలీ కోర్టు తాజాగా ఓ వినూత్న తీర్పు వెలువ‌రించింది.  భార్య తన భర్తకు నిర్వహణ ఖర్చుల కింద ప్రతినెలా వెయ్యి రూపాయలు చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేసిన ఆమెకు ప్రతినెలా రూ.12 వేలు పెన్షన్ వస్తుండ‌డం, మ‌రోవైపు భ‌ర్త‌కు ఎలాంటి ఆదాయం లేక‌పోవ‌డాన్ని కోర్టు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని తుది తీర్పునిచ్చింది.  

 

ఈ కాలంలో విడాకులు సర్వసాధారణం. విడిపోతే భర్త సంపాదన నుంచి భార్యకు భరణం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన అమెజాన్ అధినేత జెఫ్ బోజెస్ తన భార్యకు దాదాపు 50శాతం వరకు వాటా ఇచ్చాడు. దీంతో ఆమె కూడా ఒక అతిపెద్ద ధనవంతురాలిగా మారిపోయింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్ట్ ట్రంప్ తన మొదటి భార్య ఇవానా ట్రంప్ కు విడాకులిస్తూ భారీగా భరణం ఇచ్చారని చెబుతారు. ఇక మన దేశంలోనూ భారీ విడాకుల కేసులు చాలా ఉన్నాయి. వ్యాపార వేత్తలు, సినీ సెలబ్రెటీలు , రాజకీయ నేతలు చాలా మంది భారీగా భరణం ఇచ్చి తమ భార్యకు విడాకులు ఇచ్చారు. 

 

అయితే గత  విడాకుల కేసులకు విరుద్ధంగా యూపీలోని ముజఫరాబాద్ ప్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పుతో ఇది  వింత విడాకుల కేసుగా మారిపోయింది. సోషల్ మీడియాలో దీనిపై సెటైర్లు పేలుతున్నాయి. భార్య సంపాద‌న‌ప‌రురాలై, ఎలాంటి ఆదాయం లేని భ‌ర్త‌లు వేరుగా ఉంటే ...హిందూ వివాహ చ‌ట్టం-1955 కింద భార్య నుంచి భ‌ర‌ణం పొంద‌వ‌చ్చ‌నే స‌ర‌దా కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. తాము ఖాళీగా ఉంటూ భార్యల సంపాదనపై ఆధారపడి జీవించేవారికి మంచి రోజులు వచ్చినట్టేనని మరికొందరు పోస్టులు పెడుతున్నారు.