పవన్ స్టేట్మెంట్ తప్పని రుజువు చేసిన సీఎం

 

ఈ మధ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ బీజేపీ హిందుత్వ పార్టీ కాదు రాజకీయ పార్టీ అన్నారు. పవన్ అభిప్రాయంతో కొందరు ఏకీభవించొచ్చు కొందరు ఏకీభవించక పోవొచ్చు. అయితే తాజాగా ఒక సంఘటన మాత్రం పవన్ స్టేట్మెంట్ తప్పు అనే అభిప్రాయం వ్యక్తమయ్యేలా చేస్తుంది. ఈ అభిప్రాయం ఏర్పడటానికి కారణం యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్. రాజస్థాన్‌లో బీజేపీ ప్రచార బాధ్యతలను తీసుకున్న ఆయన స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే రాష్ట్రమంతటా పర్యటిస్తున్న ఆయన ఓ నియోజకవర్గంలో మాత్రం ప్రచారం చేయనంటున్నారట. పార్టీ అభ్యర్థుల కోసం హిందువులను ఏకం చేసేలా ప్రచారం చేస్తున్న యోగి.. కీలకమైన టోంక్ నియోజకవర్గంలో మాత్రం ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. అక్కడ బీజేపీ ముస్లిం అభ్యర్థి యూనస్ ఖాన్ ని బరిలోకి దించింది. అయితే హిందవుల ఓట్లను కూడగట్టేందుకు ప్రచారం చేస్తున్న తాను ముస్లిం అభ్యర్థి కోసం ఎలా ప్రచారం చేయాలన్న సందిగ్ధంలో యోగి ఉన్నారట. యోగి తీరుపై కాంగ్రెస్ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది. సొంత పార్టీ అభ్యర్థి ప్రచారానికి రాకపోవడం ఏంటని టోంక్ కాంగ్రెస్ అభ్యర్థి, సీనియర్ నేత సచిన్ పైలట్ ప్రశ్నిస్తున్నారు. ముస్లిం అభ్యర్థికి మద్దతు ఇవ్వడం ఇష్టం లేదని, అందుకే ఆయన రావడం లేదని ఆరోపించారు. ఇలాంటి భావజాలం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటడమేంటని సచిన్ పైలట్ విమర్శించారు.