3నెలల ముందే.. మొత్తం ఆధీనంలోకి.. అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ గురించి తెలుసుకోండి...

అమెరికా అధ్యక్షుడు ఏ దేశంలో పర్యటించినా ముందుగా ఆ ప్రాంతాలను అమెరికన్ సీక్రెట్ సర్వీసెస్ తమ ఆధీనంలోకి తీసుకుంటాయి. అణువణువూ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తాయి. అత్యంత కఠిన శిక్షణ పొందే సీక్రెట్ సర్వీస్ బలగాలను అమెరికా అధ్యక్షుడి భద్రత కోసం ప్రత్యేకంగా వినియోగిస్తారు. 

అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌కు ఎంపికైన వారికి 29వారాలపాటు కఠోర శిక్షణ ఉంటుంది. తుపాకీ కాల్పులు, ఆత్మాహుతి బాంబర్లను, పేలుళ్లను ఎదుర్కోవడం, అధునాతన ఆయుధాలతో ఎదురుదాడి, అనుమానాస్పద పదార్థాలను పసిగట్టడంవంటి అంశాల్లో శిక్షణ పొందుతారు. సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు నిరంతరం అధ్యక్షుడి వెన్నంటే ఉంటారు. వీరి సూచనలు, నిబంధనలను అధ్యక్షుడు తప్పక పాటించాల్సిందే. భద్రత వలయం నుంచి బయటకు వెళ్లే అధికారం ఆయనకు ఉండదు. బయట ప్రయాణించేటప్పుడు పర్యటన మొత్తాన్నీ వీడియో తీస్తారు.

అమెరికా అధ్యక్షుడు విదేశీ పర్యటన చేపట్టినప్పుడు సీక్రెట్‌ సర్వీసు అధికారులు 3 నెలల ముందే ఆ దేశానికి చేరుకొని ఏర్పాట్లు మొదలుపెడతారు. స్థానిక ప్రభుత్వ, పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటూ భద్రతా ప్రణాళికను తయారు చేసుకుంటారు. అధ్యక్షుడు పర్యటించే ప్రాంతాల్లో ఎలాంటి ముప్పు తలెత్తకుండా చూసుకుంటారు. సుశిక్షిత బెల్జియన్‌ మాలినోయిస్‌ జాగిలాలనూ వెంట తెచ్చుకొని క్షుణ్నంగా తనిఖీలు చేస్తారు. అమెరికా అధ్యక్షుడు రావడానికి ముందు 7 విమానాల్లో వివిధ పరికరాలు, హెలికాప్టర్‌, ప్రత్యేక వాహనాలు, కమ్యూనికేషన్‌ సాధనాలు సదరు దేశానికి చేరుకుంటాయి. 

అధ్యక్షుడు బసచేసే హోటల్‌ను సీక్రెట్‌ సర్వీసు అధికారులు ఎంపిక చేస్తారు. నేర చరిత్ర ఉన్న సిబ్బందిని.. అధ్యక్షుడు అక్కడ బస చేసినన్ని రోజులు హోటల్‌కు రానివ్వరు. అధ్యక్షుడు బస చేసే హోటల్‌ గదిలో ప్రత్యేక రక్షణ, నిఘా పరికరాలు అమరుస్తారు. కిటికీలకు బుల్లెట్‌ప్రూఫ్‌ ప్లాస్టిక్‌ కవచాలు ఏర్పాటు చేస్తారు. మొత్తం 6వేల 500 అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ సిబ్బంది ఉంటారు. ఇందులో 3వేల200 మంది స్పెషల్‌ ఏజెంట్లు, 1300 మంది యూనిఫామ్‌ డివిజన్‌ అధికారులు, 2వేల సాంకేతిక, సహాయ సిబ్బంది ఉంటారు.

సీక్రెట్‌ ఏజెంట్లు తాము ఎవరిని చూస్తున్నామన్నది అవతలివారికి తెలియకుండా ఉండటానికి నల్ల కళ్లద్దాలు పెట్టుకుంటారు. అనేక విభాగాల్లో సేవలందించే సీక్రెట్‌ సర్వీస్‌లో అతికొద్ది మంది మాత్రమే అధ్యక్షుడు, ఆయన కుటుంబ సభ్యుల రక్షణ బాధ్యతలు చూస్తారు. ఈ విభాగమే ప్రెసిడెన్షియల్‌ ప్రొటెక్షన్‌ డివిజన్‌. వారు నిరంతరం చుట్టూ ఉన్న జనంపై కన్నేసి ఉంచుతారు. చేతులను ఫ్యాంట్‌ జేబుల్లో పెట్టిన వ్యక్తులను, ఇతర అనుమానాస్పద కదలికలను పరిశీలిస్తుంటారు. ఆయుధాలు దుస్తుల్లో దాచేసి... అవసరమైనప్పుడు మెరుపు వేగంతో తీసి, ప్రతిదాడి చేస్తారు. అత్యవసర సమయాల్లో అధ్యక్షుడిని ఆసుపత్రికి తరలించే వరకూ కాపాడుకొనేలా 10 మినిట్‌ మెడిసిన్‌లో వీరు శిక్షణ పొందుతారు. 10 నిమిషాల వ్యవధిలోనే చేరుకునేలా ముందే ఏర్పాట్లు చేసుకుంటారు. మొత్తంగా, అత్యంత శక్తివంతంగా పనిచేసే అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ దళాలు.... అధ్యక్షుడి భద్రత విషయంలో ఎలాంటి రాజీపడరు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు మెరుపు వేగంతో పనిచేస్తారు.