కేంద్ర బడ్జెట్ తో అన్ని వర్గాలకు ప్రయోజనం కలుగుతుందా...

బడ్జెట్ కు ముందు అన్ని వర్గాల అభిప్రాయాలు తెలుసుకునేందుకు కేంద్రం ప్రయత్నించింది. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కొందరు ప్రముఖులతో భేటీ అయ్యి మరి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రధాని మోదీ ప్రత్యేకంగా పారిశ్రామిక వేత్తలతో సమావేశమై ఆర్థిక మందగమనం నుంచి బయటపడేందుకు సూచనలు అందుకున్నారు. తమకు కావలసిన పన్ను రాయితీలపై పారిశ్రామికవేత్తలు ప్రత్యేక డిమాండ్ లను పెట్టారు. దానితో పాటుగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టంగా ఉంటేనే కింది స్థాయి నుంచి అభివృద్ధి సాధ్యమని వారు అభిప్రాయపడ్డారు. ఆర్థిక మందగమనం నుంచి బయటపడాలంటే గ్రామీణ వ్యవస్థలు పరివర్తన అనివార్యమన్న అభిప్రాయాన్ని తెలియజేశారు. 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందాలంటే గ్రామీణ వ్యవస్థలు బలంగా ఉండాలని నిపుణుల అభిప్రాయాన్ని వెల్లడించారు. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం గ్రామీణాభివృద్ధికి 2 లక్షల 48 వేల కోట్లు కేటాయించారు. ఈ సారి అదనంగా 40 వేల కోట్లు కేటాయించి అవకాశముందని సమాచారం. కొన్ని శాఖలకు 15 శాతం మేర నిధుల పెంపు ఉండొచ్చు, అప్పుడే వ్యవసాయ ఆదాయం రెట్టింపు చేసే చర్యలు చేపట్టే వీలుంటుంది.8 దేశాలకు వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ ఉండగా వాటిని మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. గ్రామీణ పరపతి సౌకర్యాలను మరింతగా పెంచాలని అందుకోసం అక్కడున్న లక్షకు పైగా బ్యాంకు శాఖల ద్వారా రుణాల బట్వాడా సులభతరం చేయాలని కోరుతున్నారు.ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతే ప్రధాన ధ్యేయంగా తమ సర్కార్ పని చేస్తోందని ప్రధాని మోదీ పలు పర్యాయాలు తెలియజేశారు. 

స్వయం ఉపాధి రంగాల్లో కూడా ఎస్సీ, ఎస్టీలకు రుణ సదుపాయం కల్పించే కొత్త పథకాలు బడ్జెట్ లో  ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.ప్రతి బ్యాంకు శాఖలో కనీసం ఐదుగురు ఎస్సీ, ఎస్టీలకు రుణ సదుపాయం కల్పించాలన్న నియమం పెట్టనున్నారు. మౌలిక సదుపాయాల రంగాల్లో ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 5 సంవత్సరాలకు సరిపడా ప్రణాళికలు రచించారు. వాటి పై ప్రభుత్వం అదనంగా ఏం చెప్తుందో అనేది చూడాలి. విద్య, వైద్య రంగాలపై కూడా కేంద్రం దృష్టి సారించబోతున్నట్లు సమాచారం. కొత్తగా ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుతో పాటు ప్రైవేటు వైద్య కళాశాలలకు కూడా అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం.కొత్త బడ్జట్ కారణంగా ఎవరికైనా నష్టం జరగబోతుందా అనేది వేచి చూడాలి.