నీకు మెంటలా అంటూ సీఐకి వార్నింగ్.. మరో వివాదంలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి  

ఏపీ రాజధాని ప్రాంత వైసిపి ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవిని ఒక దాని తరువాత ఒకటి వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఒక వైసిపి కార్యకర్త వద్ద ఎన్నికల సమయంలో 1.40 కోట్లు తీసుకుని అందులో కొంత మాత్రమే చెల్లించగా మిగిలిన 80 లక్షలు తిరిగి చెల్లించమంటే అతడిని బెదిరించినట్లుగా వార్తలు వచ్చాయి. అంతకుముందు పేకాట క్లబ్ నిర్వహణలో ఎమ్మెల్యే హస్తముందని విమర్శలు వచ్చాయి. తాజాగా ఆమె మరో వివాదంలో చిక్కుకున్నారు. ఒక పోలీస్ అధికారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు ఎమ్మెల్యే శ్రీదేవి పేరుతో తాజాగా ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో సీఐని నోటికొట్టినట్లు ఆమె దూషించారు. అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిని పట్టుకున్నందుకు సీఐకి ముక్క చివాట్లు పెట్టారు. వాళ్లు నా మనషులు.. వదలిపెడతావా? లేదా? అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. తాను కనుక తలుచుకుంటే రెండు నిమిషాల్లోనే వెళ్లిపోతావ్ అంటూ ఆ సిఐ పై ఎమ్మెల్యే శ్రీదేవి మండిపడ్డారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఈ ఆడియో క్లిప్‌పై తీవ్ర దుమారం రేగుతోంది.

 

ఆ ఫోన్ సంభాషణలో ఏముందంటే..
హలో.. నీకు ఎప్పటి నుంచి చెప్తున్నా? వాళ్లను పంపేయొచ్చుగా.. నీకేమైనా మెంటలా? ఆ రోజు పట్టుకున్నప్పుడే నేను నీకు ఫోన్ చేశానా? లేదా? ఏం మాట్లాడుతున్నావ్. నేనంటే రెస్పెక్ట్ లేదా? అందరినీ వదిలిపెడతావ్. మా వాళ్లను మాత్రం వదలిపెట్టవా..? నాన్సెన్స్.. అసలు నీవు పంపిస్తావా? లేదా చెప్పు. నువ్వు నా కాళ్లు పట్టుకుని ఇక్కడికి పోస్టింగ్ తెచ్చుకున్నావ్. నేను చెప్పింది చేస్తానని ఆ రోజు చెప్పావు. ఇప్పుడు ఎమ్మెల్యేనని కూడా చూడకుండా కార్యకర్తలా బిహేవ్ చేస్తున్నావ్. నేను తలచుకుంటే రెండు నిమిషాల్లో ఇక్కడి నుండి వెళ్లిపోతావ్.. ఎక్స్ ట్రాలు చేయొద్దు.. మావాళ్లను వదిలిపెట్టు. లేదంటే ఎస్పీకి, డీజీపీకి చెబుతా.. అని ఆ వైరల్ ఆడియో క్లిప్‌లో ఉంది.

 

అయితే దీనికి సమాధానంగా సీఐ మాట్లాడుతూ అక్రమంగా మట్టి, ఇసుక తరలించడానికి వీల్లేదని చెబుతున్నట్లు ఆ ఆడియోలో ఉంది. అక్రమ మట్టి, ఇసుక తరలింపుపై ఉక్కుపాదం మోపడం రాష్ట్ర ప్రభుత్వ పాలసీ అని, అంతేకాకుండా ఇలా చేస్తే మీకు కూడా చెడ్డ పేరు వస్తుందని ఆయన ఎమ్మెల్యేకు నచ్చచెప్పే ప్రయత్నం చేసారు. దీంతో నా మాటంటే నీకు లెక్కలేదా అని ఎమ్మెల్యే శ్రీదేవి అన్నట్లుగా ఆ ఆడియో క్లిప్ లో ఉంది. ఈ ఆడియోపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికారులను బెదిరించడమేమంటని ప్రతిపక్షాల నేతలు మండిపడుతున్నారు.