రాజన్న మంచోడే కానీ కొడుకు మాత్రం మహా కంత్రి: ఉండవల్లి

 

రాజమండ్రీ లోక్ సభ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రతీ ఏటా రాజమండ్రీలో ఒక సభ నిర్వహిస్తూ, గత సం.కాలంలో తను చేసిన, చేపట్టిన వివిద కార్యక్రమాల గురించి, పార్టీ గురించి, రాష్ట్ర, దేశ వర్తమాన పరిస్థితులు, రాజకీయాల గురించి సవివరంగా ప్రజలకు తెలియజేస్తుంటారు. బుధవారం సాయంత్రం ఆయన తన వార్షిక నివేదిక సభను రాజమండ్రీలో నిర్వహించారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “స్వర్గీయ రాజశేఖర్ రెడ్డికి కేవలం తన కొడుకు వలనే అప్రతిష్ట కలుగుతోంది తప్ప ఆయన ఏనాడు అవినీతికి పాల్పడలేదు. ఆయన రాజకీయాలలో పైకి ఎదిగేందుకు చాల శ్రమించారు. కానీ ఏనాడు అక్రమంగా డబ్బు పోగేసుకొందామని ప్రయత్నించలేదు. ఆయన సీబీఐని ప్రతిపక్షాలు కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని నిర్వచించడాన్ని చాల తీవ్రంగా ఖండించారు. (ఈ సందర్భంగా సీబీఐని తప్పుపట్టడాన్ని ఖండిస్తూ ఆయన శాసన సభలో మాట్లాడిన వీడియోని ప్రదర్శించారు.) కానీ, నేడు ఆయన కొడుకు మరియు ఆయన కుటుంబ సభ్యులే సీబీఐని తప్పు పడుతున్నారు. (ఈ సందర్భంగా ఒకనాడు జగన్ మోహన్ రెడ్డి తనపై వస్తున్న ఆరోపణలపై సీబీఐ విచారణకయినా సిద్దమని చెప్పిన వీడియోని ప్రదర్శించారు.)

 

“ఈ దేశంలో ఒక చట్టం, న్యాయ వ్యవస్థ ఉన్నాయి. దానికి ఎవరూ అతీతులుకారని జగన్ మోహన్ రెడ్డి గుర్తుంచుకోవాలి. అతను చేసిన ఆర్ధిక నేరాలే అతనిని జైల్లోకి పంపించాయి తప్ప కాంగ్రెస్ పార్టీయో మరెవరో కాదని ఆయన బాగా గుర్తుందుకోవాలి. క్విడ్ ప్రో క్రింద అక్రమాస్తులు కూడబెట్టిన జగన్ మోహన్ రెడ్డి తన సంపాదన అంతా సక్రమమేనని, ఒకవేళ క్విడ్ ప్రో క్రింద తానూ లాభాపడ్డానని ఎవరయినా భావిస్తే, అందుకు కారకులయిన మంత్రులందరినీ కూడా జైలుకి పంపాలని కోరడం గమనిస్తే, ఒకవేళ అతని తండ్రి గనుక బ్రతికి ఉంటే అతనిని కూడా జైలుకి పంపమని అడిగేవారేమో?"

 

"డబ్బై కోట్ల నుండి ఒకేసారి నాలుగు వందల కోట్లు ఆస్తులు పెరిగాయని స్వయంగా పేర్కొన్న జగన్ మోహన్ రెడ్డి, అదంతా సక్రమమని నిరూపించలేకపోవడం వలననే జైలు పాలయ్యాడు తప్ప దానికి ఎవరినో నిందించడం అనవసరం. అవినీతికి పాల్పడిన సత్యం రామలింగ రాజు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, అక్రమాయుధాలు కలిగిన నేరానికి సంజయ్ దత్ వంటి వారు అందరూ కూడా, దేశంలో న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉంది గనుకనే చేసిన తప్పులకి శిక్ష అనుభవించారు. ఇది జగన్ మోహన్ రెడ్డి కూడా తెలుసుకోవాలి. ( రాజశేఖర రెడ్డి తన కొడుకు మీద అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు, ఎవరయినా దైర్యంగా న్యాయ వ్యవస్థను ఆశ్రయింఛి న్యాయం కోరవచ్చునని చెప్పిన వీడియోని ఈ సందర్భంగా ప్రదర్శించారు.)