ఇరాన్ లో కుప్పకూలిన విమానం..176 మంది దుర్మరణం

ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం ఇరాన్ లో కుప్పకూలింది. విమానంలో దాదాపు 180 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ విమానం ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లోని ఇమామ్ ఖామెనెయీ విమానాశ్రయం నుండి ఉక్రెయిన్ రాజధాని కీవ్ కి వెళుతుంది. ఇరాన్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవ్వగానే ప్రమాదానికి గురైనట్లుగా సమాచారం. సాంకేతిక సమస్యల కారణాల వల్లే ప్రమాదం జరిగిందనట్లుగా తెలిపింది ఇరాన్ వార్తా సంస్థ ఫార్స్. విమానం కుప్పకూలిన వెంటనే ఘటనాస్థలానికి సహాయ సిబ్బందిని పంపించింది ఇరాన్ ప్రభుత్వం. అప్పటికే విమానం మంటల్లో ఉందని.. తాము సిబ్బందిని పంపించి కొంతమందినైనా కాపాడగలమని అనుకున్నా కుదరలేదని ఇరాన్ అత్యవసర సేవల అధికారి పిర్హొస్సేన్ కౌలీవాండ్ మీడియాతో తెలిపారు.  ప్రమాద సమయంలో విమానంలో ఉన్నవారు సజీవంగా ఉండే అవకాశమే లేదని ఇరాన్‌కు చెందిన రెడ్ క్రిసెంట్ ప్రకటించింది. ఇక ఇప్పటికే జరుగుతున్న  ఇరాన్-అమెరికా ఘర్షణతో ఈ ఘటనకు సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.