సీఎం కుర్చీ కోసం తండ్రి నేర్పిన విలువలను విడిచిన ఉద్ధవ్ థాక్రే

 

హిందుత్వ పునాదులు.. మరాఠా రిజర్వేషన్ ల డిమాండ్లతోనే 1966 లో మహారాష్ట్రలో శివసేన ఆవిర్భవించింది. కరుడు గట్టిన హిందూ వాదంతోనే మరాఠాల కోటలో కాంగ్రెస్ కు ఎదురు నిలిచారు బాల్ ఠాక్రే. ఆ తరువాత కాలంలో మరో హిందూత్వ పార్టీ బీజేపీతో జట్టుకట్టారు. కాంగ్రెస్ ను కట్టడి చేయడం హిందూ మత వ్యాప్తి మరాఠాల రిజర్వేషన్ల కొరకు బీజేపీతో కలిసే ప్రయాణం చేసింది శివసేన. కాని ప్రస్తుత పరిణామాలతో ఇప్పుడు రూటు మార్చింది. వ్యతిరేకించిన కాంగ్రెస్ ఎన్సీపీలతోనే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు బాల్ ఠాక్రే కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే. 

బాల్ ఠాక్రే జీవించి ఉన్నంత కాలం ఆయన కుటుంబం నుంచి ఎవరు ఎన్నికల్లో పోటీ చేయలేదు. కుటుంబం నుంచి ఎవరూ కూడా ప్రభుత్వాల్లో ఉన్నత పదవులు చేపట్టరని కూడా ఠాక్రే బహిరంగంగా ప్రకటించారు. 2 సార్లు అవకాశం వచ్చినా పార్టీలో సీనియర్ నాయకులకే ముఖ్యమంత్రి పీఠం అప్పగించారు బాల్ ఠాక్రే. వాజ్ పేయి హయాంలో ఎండీఏ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. బాల్ ఠాక్రే మరణించిన ఏడేళ్ల తరువాత ఆయన తనయుడు ఉద్ధవ్ ఠాక్రే తండ్రి వేసిన బాట నుంచి పక్కకు తప్పుకున్నారు. శివసేన మూలసూత్రాల్లో ఒకటైన హిందూత్వని వదులుకున్నారు. బీజేపీని వదిలి కాంగ్రెస్ చెంత చేరారు ఉద్దవ్ ఠాక్రే. అదే విధంగా ఠాక్రేల కుటుంబం నుంచి ఎవరు ఉన్నత పదవులు చేపట్టబోరన్న బాల్ ఠాక్రే నిర్ణయాన్ని కూడా తిరగరాశారు ఆయన తనయుడు ఉద్ధవ్. ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా పావులు కదిపిన ఉద్దవ్ ఠాక్రే బిజెపితో దశాబ్దాలుగా సాగుతున్న స్నేహ బంధాన్ని తెంచేసుకున్నారు. ఎన్నికల ముందు కూటమి కట్టినప్పటికీ ఫలితాల తర్వాత బిజెపిని ముప్పుతిప్పలు పెట్టారు. మరాఠా యోధుడిగా పేరు పొందిన శరద్ పవార్ నీడన చేరి మోదీ షా ద్వయాన్ని కంగుతినిపించారు. పార్టీ ఆవిర్భవించిన 50 ఏళ్ల తర్వాత అసెంబ్లీకి పోటీ చేయకుండానే తాను కోరుకున్న విధంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. 

శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వాన మూడు పార్టీల కూటమి అధికారంలోకి వచ్చింది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సంయుక్తంగా కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించాయి. ఇతర అంశాలు ఎలా ఉన్నప్పటికీ శివసేన మూల సిద్ధాంతాలలో ఒకటైన హిందుత్వాన్ని వదులుకోవాల్సి వచ్చింది. దానికి బదులుగా ఠాక్రేలకు అసలు పడని సెక్యులర్ విధానాల పరిరక్షణకు ఉద్ధవ్ ఠాక్రే అంగీకరించాల్సి వచ్చింది. సెక్యులర్ విధానాలను తొలుత అంగీకరించని ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పీఠం కోసం మాత్రం రాజీపడక తప్పలేదు. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ లోని తొలి పేరాలోనే రెండు సార్లు సెక్యులర్ అనే పదాన్ని జోడించారు. ఇప్పటి వరకు హిందుత్వ పులిలా గాండ్రించిన శివసేన ఆవు ముఖాన్ని తగిలించుకుంది. ఇకపై రాజ్యాంగంలో పొందు పరిచిన సెక్యులర్ విధానాల పరిరక్షణ పేరుతో గోముఖ వ్యాఘ్రాలులా కనిపించబోతున్నారు శివసైనికులు.