ఒక పరాజయం 100 తప్పులు.. ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్న యూటర్న్ బాబు

 

ప్రత్యేకహోదా విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే మాట మార్చడం కూడా టీడీపీ ఘోర ఓటమికి కారణాల్లో ఒకటిగా చెప్పవచ్చు. విభజన గాయం మానాలంటే ప్రత్యేకహోదానే ఔషదమని ఏపీ ప్రజలు భావించారు. విభజనతో ఏపీకి అన్యాయం జరిగిందని, ఏపీకి న్యాయం జరగాలంటే హోదా కావాల్సిందేనని ఏపీ ప్రజలు బలంగా కోరుకున్నారు. మొదట్లో బీజేపీతో దోస్తీ సమయంలో ప్రజలతో పాటు బాబు కూడా హోదా కావాలన్నారు. బీజేపీ కూడా పార్లమెంట్ సాక్షిగా, తిరుపతి వెంకన్న సాక్షిగా హోదా ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన కొంతకాలానికి మాట మార్చి.. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నది. దీన్ని వ్యతిరేకించి హోదా కోసం పట్టుపట్టాల్సిన బాబు.. బీజేపీ నిర్ణయానికి తలొగ్గి ప్యాకేజీకి ఒప్పుకున్నారు. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీతో పాటు, ఉద్యమ సంఘ నేతలు, విద్యార్థులు.. ప్యాకేజీని వ్యతిరేకిస్తూ.. హోదా గళాన్ని బలంగా వినిపించారు. అయితే బాబు మాత్రం హోదా ఏమన్నా సంజీవనీనా అంటూ వారి మీద విరుచుకుపడ్డారు. ఇక కొందరు టీడీపీ నేతలైతే హద్దుదాటి చులకన వ్యాఖ్యలు కూడా చేశారు. అంతేనా.. హోదా కోసం పోరాడిన వారిని బాబు అరెస్ట్ లు కూడా చేయించారు. మరోవైపు అద్భుతమైన ప్యాకేజీ ఇచ్చారంటూ బీజేపీ నేతలను ఆకాశానికెత్తడాలు, సన్మానాలు చేయడాలు సరేసరి. ఈ చర్యలతో.. హోదా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఏపీ ప్రజలకు.. బాబు మీద, టీడీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైంది.

రోజులు గడిచాయి. హోదా మీద ఏపీ ప్రజలకు ఆశ మాత్రం చావలేదు. ఇంతలో కొన్నాళ్ళకు ఎన్డీయే నుంచి టీడీపీ బయటికి వచ్చింది. అప్పటి నుంచి చంద్రబాబు స్వరం పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు బీజేపీ నేతలను పొగుడుతూ, సన్మానాలు చేసిన బాబు.. బీజేపీ మోసం చేసిందని, రాష్ట్రానికి అన్యాయం చేసిందంటూ పోరాటం మొదలు పెట్టారు. హోదా ఏమన్నా సంజీవనీనా అని అడిగిన బాబు.. బీజేపీకి దూరమైన తరువాత హోదా కావాల్సిందే అంటూ అడగడం మొదలు పెట్టారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బీజేపీ ఏమో తాము ఏపీకి ఎంతో చేసామని, లెక్కలు అడిగేసరికి బాబు మాట మర్చి మా మీద విమర్శలు చేస్తున్నారని చెప్పుకొచ్చింది. మరోవైపు విపక్ష నేతలు కూడా యూ-టర్న్ బాబు అంటూ పదేపదే విమర్శలు చేశారు. దీంతో బాబు మాటలు మారుస్తున్నారన్న విషయం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. అదీగాక గతంలో హోదా అడిగిన వారి మీద ఆగ్రహం వ్యక్తం చేసి, వారిని అరెస్ట్ లు చేయించిన బాబు.. తరువాత హోదా కావాలని అడిగితే ప్రజలకు నమ్మకం కలగలేదు. అదే బాబు బీజేపీ ప్యాకేజీ ఇస్తామని చెప్పినప్పుడే.. దాన్ని వ్యతిరేకించి కచ్చితంగా హోదానే కావాలని పట్టుబట్టి పోరాడి ఉంటే.. ప్రజలను నిజమైన నాయకుడిలా కనిపించేవాడు. ఇలా యూటర్న్ బాబు అని పేరు తెచ్చుకునేవాడు కాదు.