ఓటమి నేర్పుతున్న పాఠాలు.. తుమ్మల నాగేశ్వరరావు కష్టాలు!!

తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఎదిగిన తుమ్మల నాగేశ్వర్ రావు ఇప్పుడు టిఆర్ఎస్ లో ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా గెలవలేక పోయారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు వద్ద నెంబర్ 2 గా ప్రాచుర్యం పొందారు. ఓ దశలో రాష్ట్ర రాజకీయాల్లోనూ కీలక వ్యక్తిగా నిలిచారు. జలగం వెంగళరావు కుటుంబాన్ని రాజకీయంగా ఎదిరించడంతో బాగా గుర్తింపు లభించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పార్టీ మారారు. 2014 ఎన్నికల్లో టిడిపి తరపున పోటీ చేసి ఓడిపోయినా.. కేసీఆర్ తొలి ప్రభుత్వంలో నేరుగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి చెందిన కొందరు మంత్రులలో తుమ్మల కూడా ఉన్నారు.

తన రాజకీయ జీవితంలో ఆయన ఏ రోజూ పోలీసులను ఆశ్రయించలేదు. కొందరు పోలీసు అధికారులే ఆయన కను సైగల్లో నడిచేవారని ఉదంతాలు ఉన్నాయి. అలాంటి కాకలు తీరిన రాజకీయ నేత మొట్టమొదటి సారి తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలుగుతోందని.. తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తన కనుసైగలతోనే దశాబ్దాల తరబడి రాజకీయాలను శాసించిన తుమ్మల నాగేశ్వర్ రావు పోలీసుల తీరుపై ఇటీవల తీవ్ర విమర్శలు చేశారు. ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల మాజీ సర్పంచ్ బండి జగదీశ్ పై కేసు నమోదుకు సంబంధించి తుమ్మల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేశారు. తుమ్మల వాయిస్ తో వైరల్ అవుతోన్న ఆడియో ఖమ్మంలో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నడూ లేని విధంగా తుమ్మల పోలీసులను ఆశ్రయించడం చర్చకు దారి తీసింది. తుమ్మల తన రాజకీయ జీవితంలో తొలిసారి పోలీసులను ఆశ్రయించారు. తన పేరుతో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఓ ఆడియో గురించి పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని అభ్యర్థించారు. తన సంతకంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉదంతం ఇదే మొదటిది. 

వాస్తవానికి గత ఎన్నికల్లో పాలేరు నుంచి అనూహ్యంగా ఓటమి చెందిన తుమ్మల తాజా రాజకీయాల్లో యాక్టివ్ గా కూడా లేరు. గండుగలపల్లిలో వ్యవసాయం చేసుకుంటున్నారు, పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనడం లేదు, కానీ ఆయన గొంతును పోలిన స్వరంతో ఓ ఆడియో ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది, యూట్యూబ్ లోనూ వైరల్ గా మారింది. అమరావతి రాజధాని తరలింపునకు సంబంధించి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణను తుమ్మలకు ఆపాదిస్తూ గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఈ విషయంపైనే తుమ్మల ఖమ్మం పోలీసులను ఆశ్రయించారు. ఆడియోలో ఉన్నది తన వాయిస్ కాకపోయినా తన వాయిస్ గా చిత్రీకరించి వాట్సప్ గ్రూపుల్లో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వ్యక్తులపై.. వారి వెనక ఉండి నడిపిస్తున్న శక్తులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తుమ్మల కోరుతున్నారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు కానీ పార్టీ నేతలు కానీ స్పందించడం లేదు. అందుకు అధికార పార్టీలో.. ప్రజల్లో.. విపక్షాల్లో.. కూడా తుమ్మలను టిఆర్ఎస్ పార్టీ పక్కన పెడుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది తన గొంతు కాదు బాబోయ్ అంటున్న మద్దతుగా నిలిచినచేవారే కనిపించటం లేదు. ఈ విషయంలో తనకు మద్దతుగా నిలిచి ఖండించే నాయకుడే లేకపోవటంతో తుమ్మల బాగా ఫీలవుతున్నారు.