సీట్లు కాదు.. గెలుపే ముఖ్యమంటున్న టీడీపీ

 

తెలంగాణలో టీఆర్ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. సీట్ల సర్దుబాటు విషయంలో ఇన్నిరోజులు కూటమిలో చర్చల మీద చర్చలు జరిగాయి. అయితే ఇప్పటికి సీట్ల సర్దుబాటు విషయం ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతిలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ నేతలు ఈరోజు సమావేశమయ్యారు. మహాకూటమి సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చినందున టీడీపీ అభ్యర్థులపై నిర్ణయం తీసుకునేందుకు ఈ సమావేశం నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని నేతలు చంద్రబాబుకు వివరించారు. ఎన్నికల కోసం ఆరుగురు సీనియర్లతో పార్టీ ఓ కమిటీ వేసింది. అభ్యర్థుల సమర్ధత, సామాజిక వర్గాల ప్రాతిపదికన ఇప్పటికే ఓ జాబితా రూపొందించిన నేతలు ఆ వివరాలను చంద్రబాబు ఎదుట ఉంచారు. అనంతరం టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌. రమణ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో టీడీపీ సీట్ల కంటే గెలుపుకే ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. తెలంగాణలో పోటీ చేసే అభ్యర్థులను ఇవాళ, రేపటిలోగా ఖరారు చేస్తామన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్టు వేదికగా అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. తెలంగాణలో ఏర్పడే రెండో శాసనసభలో టీడీపీ డబుల్‌ డిజిట్‌ సాధించి ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని రమణ ఆశాభావం వ్యక్తం చేశారు.