బ్రహ్మోత్సవాల్లో రాత్రి వాహన సేవల్లో మార్పులు చేసిన టీటీడీ...

 

రోజుకు దాదాపు డెబ్బై వేల నుంచి లక్ష మంది భక్తులు దర్శించుకునే పుణ్యక్షేత్రం ఏదైనా ఉందంటే అది తిరుమలే. తిరుమల వెంకన్న బ్రహ్మోత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం రాత్రి వాహన సేవల సమయంలో మార్పులు చేయాలని టీటీడీ నిర్ణయించింది. ప్రస్తుతం రాత్రి వాహన సేవలను ఎనిమిది గంటలకు ప్రారంభిస్తుండగా వచ్చే ఏడాది నుంచి రాత్రి ఏడు గంటలకే ప్రారంభించాలని నిర్ణయించింది టిటిడి. వాహన సేవల సమయంలో మార్పుల కారణంగా ఇకపై బ్రహ్మోత్సవాల సమయంలో ఊంజల్ సేవలను రద్దు చెయ్యాలని టీటీడీ నిర్ణయించింది. ఈ కలియుగ వైకుంఠుడు పవిత్ర పుణ్యక్షేత్రంగా యుగయుగాల నుంచి భాసిల్లుతున్న క్షేత్రం తిరుమల. అందుకే ఈ క్షేత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.  పూజించే వారిని రక్షించే వజ్ర పంజరం గా తన్మయించి స్తుతించే వారి ఆనంద రూపంగా మారింది తిరుపతి క్షేత్రం.అందుకే తిరుమలేశుని కోవెల నిత్య కల్యాణం పచ్చతోరణంగా ఉంటుంది.సంవత్సరంలోని మూడు వందల అరవై ఐదు రోజులూ ఈ క్షేత్రంలో రద్దీ ఉంటూనే ఉంటుంది. 

దేశం నలుమూలల నుంచే కాదు విదేశాల నుంచి కూడా భక్తులు శ్రీనివాసుని దర్శనం కోసం వేలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించి వస్తుంటారు. గంటల సేపు క్యూలైన్ లలో నిల్చోని అరవింద దళాక్షుణ్ణి ఆర్తి తీరా దర్శించుకుంటారు. సాధారణ భక్తులే కాదు, సంపన్నులు, ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, రాజకీయవేత్తలు క్యూలు కట్టే క్షేత్రం ఏదంటే అది తిరుమలే. అందుకే తిరుమల గిరులు ఎప్పుడూ జనసంద్రమే, శ్రీవారి దర్శనానికి వచ్చే వారు వస్తుంటే వెళ్లేవారు వెళ్తూంటారు. సాధారణ భక్తులు సర్వదర్శనంతో సంతృప్తి చెందితే కొందరు భక్తులు శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొంటారు. మరికొందరు కల్యాణోత్సవంలో పాల్గొంటారు. సహస్ర కలశాభిషేకం, తోమాల, అర్చన, అభిషేకం మొదలైన సేవల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు. ఒక్కొక్క సేవలోను ఒక్కో దివ్యానుభూతి పొందడం జరుగుతుంది. అందుకే వచ్చిన వారే మళ్లీ మళ్లీ వస్తారు. చూసిన కనులే మళ్లీ మళ్లీ ఆ దేవదేవుడిని దర్శించుకుంటాయి. స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని ఎన్నిసార్లు దర్శించినా తనివి తీరదు అన్నట్లుగా. ఎంతటి మహిమాన్విత క్షేత్రంలో ప్రతి రోజూ పండుగే, ప్రతి రోజూ ఉత్సవమే, ఏడాది పొడవునా దాదాపుగా నాలుగు వందల యాభై ఉత్సవాలు జరుగుతాయి. 

ఏడాది పొడవునా ఏడుకొండల వాడికి ఎన్ని ఉత్సవాలు జరిగినా సంవత్సరానికి ఒక్కసారి జరిగే బ్రహ్మోత్సవాల ప్రత్యేకతే వేరు. తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ ఉత్సవాలను తిలకించాలని వివిధ వాహనాలపై ఊరేగే స్వామిని దర్శించాలని భక్త కోటి ఉవ్విళ్లూరుతోంది. ఈ ఉత్సవాలను తిలకించేందుకు వచ్చే భక్తుల సంఖ్య ఏటికేటికీ పెరుగుతూ ఉండటంతో టీటీడీ కూడా భారీగా ఏర్పాట్లు చేస్తోంది. బ్రహ్మోత్సవాలు ప్రారంభానికి మూడు నెలల మునుపు నుంచే తిరుమలలో ఏర్పాట్లను ప్రారంభిస్తారు. వాహన సేవలను తిలకించేందుకు వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసి భక్తులకు సంతృప్తికరమైన వాహన సేవ దర్శనంతో పాటు త్వరితగతిన మూల విరాట్ దర్శనం కల్పిస్తోంది టీటీడీ. శ్రీ వారి బ్రహ్మోత్సవాలలో ఉదయం వాహన సేవ తొమ్మిది గంటలకు ప్రారంభం అవుతుండగా రాత్రి వాహన సేవ ఎనిమిది గంటలకు ప్రారంభం అవుతుంది. ఇక ఉత్సవాలలోనే అతి ప్రాముఖ్యమైన గరుడసేవను మాత్రం టీటీడీ ఏడు గంటలకే ప్రారంభిస్తుంది.ఇక బ్రహ్మోస్తవాళల్లో రాత్రి వేళలో కూడా టీటీడీ దర్శనాలకు వాహనాలు తోడవుతాయని చెప్పుకోవచ్చు.