కీలక నిర్ణయాలు తీసుకున్న టిటిడి బోర్డ్...

తిరుమలలో టిటిడి బోర్డ్ కీలక నిర్ణయాలు తీసుకుంది, తాగునీటి కొరత నివారణకు శ్రీకారం చుట్టింది. బాలాజీ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టేందుకు బోర్డు నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన పాలక మండలి తొలి సమావేశం జరిగింది. పెండింగ్ లో ఉన్న పలు అంశాల పై సమావేశంలో చర్చించారు. బాలాజీ రిజర్వాయర్ నిర్మాణంతో తిరుమల కొండపై తాగు నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని బోర్డు సభ్యులు అభిప్రాయపడ్డారు. అమరావతిలో శ్రీ వారి ఆలయ నిర్మాణ పరిధిని తగ్గిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ముప్పై ఆరు కోట్లతో నిర్మాణాన్ని జరపాలని తీర్మానించింది. తిరుమలలో కాలుష్యం పెరిగి పోతుండడంతో దానిని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ బస్సులు, కార్లను ప్రవేశ పెట్టాలని నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో అవిలాల చెరువు అభివృద్ధికి కేటాయించిన నిధులను బాలాజీ రిజర్వాయర్ నిర్మాణానికి మళ్లించేందుకు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

తిరుపతిలో గరుడ వారది నిర్మాణానికి నిధుల కేటాయింపుపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. టీటీడీలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి సబ్ కమిటీని ఏర్పాటు చేయనుంది. భక్తుల సౌకర్యానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామన్నారు టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి. పెండింగ్ లో ఉన్న అన్ని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.  టీటీడీ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది. బోర్డు సభ్యుడిగా మైహోమ్ గ్రూప్స్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ బోర్డులో తనకు స్థానం కల్పించినందుకు జూపల్లి రామేశ్వరరావు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. చినజీయర్ అనుగ్రహంతోనే తను టీటీడీ సభ్యుడను అయ్యారని చెప్పారు. సామాన్య భక్తులకు సేవ చేసేందుకు కావలసిన శక్తిని ప్రసాదించాలని ఆయన శ్రీవారిని వేడుకున్నారు.