ప్రభుత్వంపై సమర శంఖం పూరించనున్న ఆర్టీసి కార్మికులు...

 

ఆర్టీసీ కార్మిక జేఏసీ ఇవాల్టి సకల జనుల సమరభేరి సభతో తమ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని భావించింది. ఇందులో భాగంగానే పక్కా ప్రణాళికను రూపొందించింది, ప్రభుత్వంపై తమ పోరును ప్రత్యక్షంగా చాటుకోవాలని సర్కార్ తో అమీ తుమీకి సిద్ధమైంది ఆర్టీసీ జేఏసీ. ఇందు కోసం పోలీసులు సభకు అనుమతి లేదంటూ అడ్డంకులు సూచించినప్పటికీ కోర్టుకు వెళ్లి మరీ పర్మిషన్ తెచ్చుకుంది. కార్మిక జేఏసీ తలపెట్టిన బహిరంగ సభకు అన్ని పక్షాలూ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. నిన్నటి వరకూ డిమాండ్ల పరిష్కారం కోసం వేర్వేరు తరహాలో నిరసన చేపట్టిన కార్మికులు ఇవాళ బహిరంగ సభ ద్వారా తమ స్వరాన్ని పెంచి ప్రభుత్వ ధోరణిని ప్రజలకు తెలియజెప్పాలని భావించారు.

అయితే అనుకున్నట్లుగానే ఈ సభను సరూర్ నగర్ మైదానంలో భారీ స్థాయిలో నిర్వహించాలనుకున్నారు జేఏసి నాయకులు. సభకు ఉద్యోగ విద్యార్థి జేఏసీతో పాటు లక్షలాది మందితో భారీగా నిర్వహించాలని నిర్ణయించారు. వీరిలో దాదాపు లక్షన్నర మంది కార్మికుల కుటుంబీకులే ఉంటారని అంచనా వేస్తున్నారు, సమ్మెకు విపక్షాలన్నీ సంపూర్ణంగా మద్దతు ఇవ్వడంతో సభ ద్వారానే తమ సత్తా చాటాలని అనుకున్నారు. కానీ హై కోర్టు సూచనలతో ప్లాన్ అంతా తారు మారైంది. సభావేదిక సరూర్ నగర్ మైదానం నుంచి ఇండోర్ స్టేడియానికి మారింది, దీంతో ఆర్టీసీ జేఏసీ అప్పటి వరకూ వేసుకున్న అంఛనాలు పూర్తిగా మారిపోయాయి.

కేవలం ఐదు వేల మంది పట్టే సామర్థ్యం కలిగిన స్టేడియంలో సభను ఏర్పాటు చేసుకోమనడంతో అంతర్మధనంలో పడ్డారు జేఏసీ నేతలు. అది కూడా మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలలో సభ నిర్వహించుకోవాలని డెడ్ లైన్ పెట్టింది. ఆర్టీసీ బకాయిలపై హై కోర్టు వ్యాఖ్యలు కార్మికుల ఉత్సాహం పెంచినప్పటికీ బహిరంగ సభను భారీ ఎత్తున నిర్వహించుకునేందుకు కుదరకపోవడంతో ఒకింత నైరాశ్యానికి లోనైనట్లుగా తెలుస్తోంది.

అయితే అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ జేఏసీ చూస్తోంది. ఈ సభకు అన్ని పార్టీల అధ్యక్షులు హాజరవుతున్నారు, ఈ సభ నుంచే తమ సమస్యల్ని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరనున్నారు ఆర్టీసీ కార్మికులు. సభకు పెద్ద ఎత్తున కార్మికులు తరలి వచ్చి విజయవంతం చేయాలని కార్మిక జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి పిలుపునిచ్చారు. కార్మిక సంఘాల సభ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.