ఆర్టీసీ సమ్మెలో కొత్త ట్విస్ట్.. సమ్మెకు బ్రేకు లేదు!

 

ఇబ్బంది పడేది సామాన్య ప్రజలు, కార్మికులే కదా.. మనదేం పోయింది?, మన పంతం మనది అన్నట్టుంది.. అటు ప్రభుత్వ వైఖరి, ఇటు ఆర్టీసీ జేఏసీ వైఖరి. సమ్మె మొదలై దాదాపు యాభై రోజులైంది. ఎవ్వరూ మెట్టు దిగరు.. ముగింపు పలకరు. ఒకవేళ ఎవరైనా ఒక మెట్టు దిగినా మరొకరు పట్టించుకోరు. ఇలా ఈ వ్యవహారాన్ని సాగదీస్తూ అర్థ శతదినోత్సవం వైపు పరుగులు తీయిస్తున్నారు. సామాన్య ప్రజలకు కోపం, చిరాకు, అసహనం తెప్పిస్తున్నారు.

మొన్నటికి మొన్న ఆర్టీసీ సమ్మెపై జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి సమ్మె విరమించే యోచనలో ఉన్నట్టు ప్రకటించారు. ఎటువంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. దీంతో ఆయన మీద విమర్శలు వ్యక్తమయ్యాయి. 20 పైగా డిమాండ్లతో సమ్మెకు దిగారు. కొద్ది రోజులకి ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అంశాన్ని ప్రస్తుతానికి పక్కన పెడుతున్నాం. మిగతా వాటిపై చర్చలకు పిలవండి అన్నారు. కొన్నిరోజులకి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోండి సమ్మె విరమిస్తాం అన్నారు. కార్మికులు ప్రాణాలు కోల్పోయారు, ప్రజలు నలభై రోజులకి పైగా ఇబ్బంది పడ్డారు, ఒక్క డిమాండ్ కూడా నెరవేరలేదు.. మరి ఈ సమ్మె చేసి ఏం సాధించినట్టు అని విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో అశ్వత్థామరెడ్డి పునరాలోచనలో పడ్డారు. తాజాగా, ఆర్టీసీ సమ్మె యధాతథంగా కొనసాగుతుందని ప్రకటించి ట్విస్ట్ ఇచ్చారు. 

సమ్మె విరమణ నిర్ణయంపై శుక్రవారం ఆయన పున:సమీక్ష జరిపారు. సమ్మె విరమిస్తామని చెప్పినా ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేకపోవడంతో సమ్మె కొనసాగించాలని నిర్ణయించామని తెలిపారు. కార్మికులెవరూ బస్సు డిపోల వద్దకు వెళ్లి విధుల్లోకి తీసుకోవాలని కోరవద్దన్నారు. కార్మికులు అధైర్య పడవద్దని, న్యాయం జరిగేలా చూసే బాధ్యత జేఏసీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. శనివారం మరోసారి జేఏసీ సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటుందన్నారు అశ్వత్థామరెడ్డి. ఇదంతా చూస్తుంటే ఆర్టీసీ సమ్మెకు ఇప్పట్లో బ్రేకు పడేలా లేదనిపిస్తోంది.