హైదరాబాద్ బస్టాప్ ల్లో ఆర్టీసీ గైడ్స్... అడిగిమరీ బస్సెక్కిస్తారు... 

50రోజుల ఆర్టీసీ సమ్మెతో యాజమాన్యం భారీ గుణపాఠాన్నే నేర్చుకున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా నష్టాల నుంచి గట్టెక్కించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు అనేక చర్యలు చేపడుతున్నారు. ఆర్టీసీ సమ్మె తర్వాత సమూల ప్రక్షాళన చేపట్టిన యాజమాన్యం... సంస్థను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, అలాగే ప్రయాణికులకు దగ్గరయ్యేందుకు సరికొత్త విధానాలను అవలంభిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ప్రయాణికుల సౌకర్యార్ధం ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్ల దగ్గర మార్పులకు శ్రీకారం చేపట్టారు. బస్సుల రాకపోకలపై ప్రయాణికులకు సమాచారం అందించేందుకు మెగాఫోన్ వ్యవస్థను మొదలుపెట్టారు.

ముఖ్యంగా హైదరాబాద్‌లో ఆర్టీసీని బలోపేతం చేయడం కోసం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బస్సుల షెడ్యూల్‌ను మార్చడమే కాకుండా, ఏ బస్సు ఎక్కడ ఆగుతుంది... ఏ సమయంలో వస్తుంది... ఏ నెంబర్ బస్సు ఎక్కడి వెళ్తుంది... ఇలా, ప్రయాణికులకు సమాచారం అందించడానికి, ప్రతి బస్టాండ్‌లో గైడ్స్‌‌ను ఏర్పాట్లు చేస్తున్నారు. వీళ్లంతా మెగా ఫోన్ల ద్వారా... ఆయా బస్సుల వివరాలు అందిస్తూ ప్రయాణికులకు సహాయపడేలా చర్యలు చేపట్టారు. 

ఒకవేళ బస్సుల్లో తగినంతమంది ప్రయాణికులు లేకపోతే ప్రీక్వెన్నీ నియంత్రిస్తూ ఓఆర్ పెంచేందుకు రెండుమూడు నిమిషాలు నిలిపి పంపేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ సమ్మె తర్వాత చేపట్టిన చర్యలతో సంస్థ మెల్లమెల్లగా గాడిలో పడుతోందని అంటున్నారు. సర్వీసుల క్రమబద్ధీకరణతో నష్టాలు గణనీయంగా తగ్గుతున్నాయని చెబుతున్నారు. మొత్తానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లుగా ఆర్టీసీ కార్మికులు బోనస్ తీసుకునేలా సకల చర్యలు చేపడుతున్నారు. మరి, తెలంగాణ ఆర్టీసీ ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో మున్ముందు తెలుస్తుంది.