మెట్టు దిగిన ఆర్టీసీ జేఏసీ.. కేసీఆర్ ఏం చేస్తారో? ఏంటో?

 

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కారణంగా 40 రోజులు నుంచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. అటు ప్రభుత్వం కానీ, ఇటు ఆర్టీసీ కార్మిక సంఘాలు కానీ.. ఎవరికి వారు మాదే కరెక్ట్.. వెనక్కి తగ్గేది లేదంటూ.. ప్రజలు పడుతున్న ఇబ్బందులు కూడా పట్టించుకోకుండా మొండిగా వెళ్తున్నారు. ప్రభుత్వం తమని చర్చలకు పిలిచి, సమస్యలు పరిష్కరించేవరకు మా సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది. చర్చల్లేవు ఏం లేవు, విలీనం మాటే లేదు, అసలు అందరూ డిస్మిస్ అంటూ సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. ఇద్దరూ వెనకడుగు వేయట్లేదు. హైకోర్టు కూడా నాలుగు చివాట్లు పెట్టి, ప్రజల ఇబ్బంది గురించి ఆలోచించండని మొత్తుకుంటూ.. విచారణ వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోతుంది. ఒకవైపు ప్రజల ఇబ్బందులు పడుతున్నారు, మరోవైపేమో నెల జీతంతో కుటుంబాలను నెట్టుకొస్తున్న కార్మికులు కొందరు మనస్తాపంతో బలిదానాలు చేసుకుంటున్నారు. దీంతో ఇక ప్రభుత్వం దిగిరాదని అర్ధమైన ఆర్టీసీ జేఏసీ తానే ఒక మెట్టు దిగింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌ను తాత్కాలికంగా పక్కనపెట్టింది. మిగిలిన డిమాండ్లపై చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.

గురువారం సాయంత్రం ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యాలయంలో.. ఆర్టీసీ జేఏసీ మరియు వివిధ రాజకీయ పార్టీల నేతలు భేటీ అయ్యారు. ఆర్టీసీ సమ్మె, కార్మికుల ఆత్మహత్యలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. అనంతరం ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... కార్మికుల ఆత్మహత్యలు జేఏసీని బాధిస్తున్నాయని తెలిపారు. కనీసం మిగతా డిమాండ్లనైనా పరిష్కరించుకోవాలన్న ఉద్దేశంతో తాత్కాలికంగా విలీనాన్ని పక్కనపెట్టామని, దీనికి కార్మికులు అధైర్యపడవద్దని తెలిపారు. సమ్మె 41 రోజులుగా కొనసాగుతున్నా.. ఇప్పటికే 23 మంది వరకు కార్మికులు మరణించినా.. ప్రభుత్వంలో కించిత్తు స్పందన కూడా లేదని విమర్శించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు వారి కుటుంబాలను పరామర్శించలేదని అసహనం వ్యక్తం చేసారు. ఈ మరణాలన్నింటికీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ప్రభుత్వం రెచ్చగొట్టే ప్రకటనలు, కోర్టుకు సమర్పిస్తున్న తప్పుడు నివేదికలతో కార్మికులు తీవ్ర మానసిక ఆందోళనకు గురై మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఇప్పట్లో సాధ్యం కాదన్న ఒకే ఒక్క కారణాన్ని చూపి.. సమ్మె చేయడమే తప్పన్నట్లుగా కోర్టుని, ప్రజలను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. విలీనమనే అంశాన్ని సాకుగా చూపి, కార్మికుల డిమాండ్లు పరిష్కార సాధ్యం కాదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఆ ఒక్క డిమాండ్‌ పరిష్కారం కాదన్న సాకుతో మిగతా డిమాండ్లన్నీ అలాంటివేనన్న దుష్ప్రచారం సీఎం చేస్తున్నారని అన్నారు. అందుకే తాత్కాలికంగా విలీనం డిమాండ్ ని పక్కనపెట్టామని, ఇకనైనా మిగిలిన డిమాండ్లపై చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని కోరారు . మరి జేఏసీ ఓ మెట్టు దిగింది. ప్రభుత్వం కూడా ఓ మెట్టు దిగి.. చర్చలు జరిపి సమ్మెకు బ్రేక్ వేస్తుందేమో చూడాలి.