బతుకమ్మ చీరల పంపిణీకి ముహూర్తం ఖరారు

 

కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు వెళ్లారు. ఘన విజయం సాధించి రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసారు. ఇదే ఉత్సాహంలో తెలంగాణ కొత్త ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీకి ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అదేంటి బతుకమ్మ అయిపోయిందిగా!! ఇప్పుడు చీరల పంపిణీ ఏంటి అనుకుంటున్నారా?. ముందస్తు ఎన్నికలు వచ్చాయి కదా.. అందుకే ఆ చీరల పంపిణీ కాస్త వెనక్కి వచ్చింది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక.. వ్యక్తిగతంగా లబ్ధి చేకూరుస్తూ ఓటర్లను ప్రభావితం చేసేలా ఉండే పథకాలకు ఎన్నికల సమయంలో బ్రేక్ వేస్తారు. అందుకే రైతు బంధు పథకం కూడా రైతులకు నేరుగా చెక్కులు ఇవ్వకుండా.. అకౌంట్లో డబ్బులు వేసే ఏర్పాట్లు చేశారు. బతుకమ్మ చీరలకు కూడా అప్పుడు అలాగే బ్రేక్ పడింది.

ఎన్నికలకు ముందే రాష్ట్ర వ్యాప్తంగా పంచడానికి సుమారు 95 లక్షల చీరలను ప్రభుత్వం సిద్ధం చేసుకున్నా.. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆ పంపిణీకి బ్రేక్ పడింది. టీఆర్ఎస్ ప్రభుత్వం చీరల పంపిణీ చేయాలని భావించగా ఎన్నికల కమీషన్ దానిని అడ్డుకుంది. మళ్ళీ త్వరలోనే పంచాయతీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే చీరల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అన్నీ అనుకున్నట్లు కుదిరితే వచ్చే వారంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేసే అవకాశముంది.