‘మీటూ’కి మద్దతుగా రాహుల్‌గాంధీ

 

బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్తా పదేళ్ల క్రితం తనను నానాపటేకర్‌ లైంగికంగా వేధింపులకు గురి చేశారంటూ ఆరోపణలు చేయడంతో భారత్‌లో మీటూ ఉద్యమం ఊపందుకుంది. దీంతో ఎందరో నటీమణులు, పాత్రికేయులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి సోషల్ మీడియా ద్వారా బయటపెడుతున్నారు. సినీ, క్రీడా, రాజకీయ రంగాలతో పాటు పలు రంగాల్లో మహిళలు ఎదుర్కొన్న వేధింపులు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను మీటూ ద్వారా బయటపెడుతున్న మహిళలకు ఎంతోమంది ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ ఉద్యమానికి అండగా నిలిచారు. ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని ఆయన ట్విట్టర్ ద్వారా కోరారు. ‘మహిళలను ఎంతగా గౌరవించాలనేది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన సమయం ఇది. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వారి జీవితం ముగిసిపోతుంది. దీని పట్ల నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను. సమాజంలో మార్పు రావాలంటే నిజాన్ని నిర్భయంగా, గొంతెత్తి చెప్పాల్సిన అవసరం ఉంది’ అంటూ రాహుల్‌గాంధీ మీటూ హ్యాష్‌ట్యాగ్‌ పెట్టి ట్వీట్‌ చేశారు.