వైట్‌హౌజ్‌లో ట్రంప్, ఒబామా.. ఒకరిపై ఒకరు ప్రశంసలు..

 

అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ గెలుపొందిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈరోజు ట్రంప్, ఒబామా ఇద్దరూ వైట్‌హౌజ్‌లో క‌లుసుకున్నారు. డోనాల్డ్ ట్రంప్ దేశాధ్య‌క్ష ప‌ద‌వికి అన‌ర్హుడు. ఆయ‌న టెంప‌ర్ స‌రిగా ఉండ‌దు. గ‌ణ‌తంత్ర అమెరికాకు అదో ప్ర‌మాదం అని బ‌రాక్ ఒబామా రిప‌బ్లిక‌న్ అభ్య‌ర్థి గురించి అధ్య‌క్ష ప్ర‌చారం స‌మ‌యంలో ఆరోపించారు. ట్రంప్ కూడా ఒబామాపై అదే రీతిలో ఎదురు దాడి చేశారు. ఒబామా పుట్టింది ఎక్క‌డ‌, అత‌నో బ‌ల‌హీన అధ్య‌క్షుడు అంటూ ట్రంప్ ఆరోప‌ణ‌లు చేశారు. దీంతో ఇద్దరూ కలిసిన నేపథ్యంలో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్ర‌స్తుత అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా పంపిన ఆహ్వానాన్ని స్వీక‌రించిన ట్రంప్ ఇవాళ వైట్‌హౌజ్‌ను సంద‌ర్శించారు. దాదాపు ఒబామాతో సుమారు గంట‌న్న‌ర స‌మావేశం అయ్యారు. దేశాన్ని ముందుకు న‌డిపించేందుకు మీకు కావాల్సిన స‌హాయ‌న్ని అందిస్తామ‌ని ఈ సంద‌ర్భంగా ఒబామా అన్నారు. ట్రంప్‌తో సాగిన సంభాష‌ణ అద్భుత‌మ‌ని, త‌న‌తో క‌లిసి ప‌నిచేసేందుకు ట్రంప్ చూపిన ఉత్సాహాన్ని ఒబామా ఆహ్వానించారు. ట్రంప్ కూడా ఒబామాపై ప్ర‌శంస‌లు గుప్పించారు. ఒబామా మంచి వ్య‌క్తి అంటూ ట్రంప్ అన్నారు. ఒబామాతో స‌మావేశం కావ‌డం గౌర‌వంగా భావిస్తున్న‌ట్లు కాబోయే ప్రెసిడెంట్ తెలిపారు. మొత్తానికి ఇప్పుడు ఇద్దరి అభిప్రాయాలు మారి ఒకరిమీద ఒకరు ప్రశంసలు కురిపించుకోవడం అభినందించాల్సిన విషయమే.