దక్షిణ తెలంగాణలో దమ్ములేదట!

 

 

 

తెలంగాణని ఉద్ధరించడానికే తాను, తన కుటుంబం ఈ భూమ్మీద అవతరించినట్టు ఫీలయిపోయే కేసీఆర్ అసలు సత్తా ఏంటో ఈసారి ఎన్నికలలో తేలిపోతుంది. ఈ ఎన్నికల తర్వాత కేసీఆర్ కుటుంబం కుక్కిన పేనుల్లా పడి వుండటం తప్ప మరేమీ చేయలేరన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అతి తెలివి కాకపోతే, తెలంగాణ ఇస్తే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని బాహాటంగా ప్రకటించిన కేసీఆర్ తీరా తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కళ్ళు గిర్రున తిరిగేలా చేశాడు. విలీనం, పొత్తులు లేవు పొమ్మని డిసైడ్ చేశాడు. అలా డిసైడ్ చేసి తానేదో తెలివైన పని చేశానని, ఇక తెలంగాణ ఓటర్లందరూ తన పార్టీకి ఓట్లు వేసేస్తారని కేసీఆర్ అనుకుంటున్నాడు.

 

అయితే కేసీఆర్‌కి, ఆయన కుటుంబానికి, ఆయన పార్టీకి తెలంగాణలో అనుకున్నంత దృశ్యం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. సీమాంధ్రులు, ముస్లింలు ప్రభావితం చేసే హైదరాబాద్‌లో టీఆర్ఎస్‌కి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు. దక్షిణ తెలంగాణలో అయితే కేసీఆర్ పప్పులు ఉడికే అవకాశాలు కనిపించడం లేదు. ఉత్తర తెలంగాణా వాడివి మామీద నీ పెత్తనం ఏంటంట అని దక్షిణ తెలంగాణ నాయకులు విరుచుకుపడుతున్నారు. దక్షిణ తెలంగాణ అస్తిత్వాన్ని ఉత్తర తెలంగాణవాళ్ళ చేతుల్లో పెట్టడం తమకు ఎంతమాత్రం ఇష్టం లేదని అంటున్నారు. ఈ విషయాన్ని మరింత సూక్ష్మంగా పరిశీలిస్తే, ఉత్తర తెలంగాణలో తెరాస ప్రభావం దాదాపు శూన్యమేనని చెప్పాలి.


ఖమ్మం జిల్లా విషయానికి వస్తే అక్కడ టీఆర్ఎస్ పార్టీని పట్టించుకునేవారే వుండరు.ఇక కేసీఆర్‌కి మిగిలింది ఉత్తర తెలంగాణ. ఆ ప్రాంతంలో ఉన్న సీట్లలో కేసీఆర్ పార్టీకి కొన్ని సీట్లు వస్తే రావొచ్చేమో! ఈ మాత్రం భాగ్యానికి తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి రాబోతున్నట్టు, తెలంగాణ పునర్నిర్మాణ బాధ్యతలు తామే నిర్వహించబోతున్నట్టు కేసీఆర్ కుటుంబం చెప్పుకోవడం కామెడీగా వుందని  రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఎక్కువ తెలివితేటలు ప్రదర్శించకుండా టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినట్టయితే  కేసీఆర్ పరువు దక్కే అవకాశాలు వుంటేవని చెబుతున్నారు. కేసీఆర్ అతి తెలివితేటలకు మూల్యం ఈ ఎన్నికలలో చెల్లించక తప్పదని అంటున్నారు.